Israel War Death Toll :పశ్చిమాసియాలో హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. దక్షిణ ఇజ్రాయెల్వీధుల్లో హమస్ ఉగ్ర సంస్థ సభ్యులతో ఇజ్రాయెల్ సైన్యం.. రెండో రోజూ పోరాటం కొనసాగించింది. గాజాలోని భవనాలను ఇజ్రాయెల్ వైమానికదళం నేలమట్టం చేసింది. ఇదే అదునుగా ఉత్తర భాగంలో సిరియా సరిహద్దుల వద్ద హెజ్బొల్లా సంస్థ సభ్యులు సైతం.... ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా దాడులకు దిగారు.
ఊహించని రీతిలో శనివారం ఇజ్రాయెల్‌పై వేల రాకెట్లతో విరుచుకుపడి, సైనిక రక్షణలను చేధించిన హమాస్ తీవ్రవాదులు.. అనేక మందిని బందీలుగా తీసుకుపోయారు. వారిలో ఇజ్రాయెల్ జాతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన అనేక మంది పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న తమ బందీలను విడిపించుకునేందుకు.. హమాస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్.. ఈజిప్టు సాయం కోరగా ఆ దేశ నిఘా సంస్థ రంగంలోకి దిగింది. హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధులతో చర్చిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు యత్నిస్తోంది. తాము యుద్ధంలో ఉన్నట్లు మరోసారి ప్రకటించింది ఇజ్రాయెల్. శత్రువులను ఎదుర్కొనడానికి అవసరమైన మిలిటరీ చర్యలను చేపట్టినట్లు చెప్పింది.
అధికారిక గణాంకాల్లో స్పష్టత లేకున్నా స్థానిక మీడియా ప్రకారం హమాస్ దాడుల తర్వాత చనిపోయినవారి సంఖ్య 600 దాటింది. వారిలో 44 మంది సైనికులు ఉన్నట్లు తెలిపింది. తమ పరిధిలో 313 మంది చనిపోయినట్లు గాజా తెలిపింది. తాము 400 మంది తీవ్రవాదులను చంపినట్లు.. ఇజ్రాయెల్ సైనికాధికారి చెప్పారు. దేశం యుద్ధంలో ఉందన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. తమ శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గాజాలోని తమ ఇళ్లలో దాక్కున్న ప్రతి హమాస్ కమాండర్‌ను మట్టుబెడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ మాత్రం తాము పోరాటం ఆపబోమని తెలిపింది. తాము ఆక్రమించిన ప్రాంతాల్లోకి మరిన్ని బలగాలు, ఆయుధాలు పంపుతామని ప్రకటించింది. అత్యధిక ప్రజలు ఉండే గాజాకు శనివారం విద్యుత్ నిలిపివేసిన ఇజ్రాయెల్ ఇంధనం, సరకులు కూడా పంపబోమని హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న హెచ్చరికలతో వైమానిక దాడుల నుంచి కాపాడుకునేందుకు గాజా పౌరులు... తమ ఇళ్లు వదిలి సరిహద్దు ప్రాంతాలకు తరలి పోతున్నారు.