Israel Hamas War :గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు నూతన సంవత్సరం తొలిరోజే ఊహించని పరిణామం ఎదురైంది. దాదాపు మూడు నెలలుగా గాజాపై బాంబు దాడులతో ఇజ్రాయెల్ విరుకుపడుతుండగా తాజాగా హమాస్ చెలరేగింది. గాజా నుంచి వందలాది రాకెట్లు ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చాయి. వాటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోగా పెద్ద శబ్దాలతో ఆకాశంలో పేలుళ్లు సంభించాయి. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఈ రాకెట్లు పడినట్టు తెలుస్తోంది. హమాస్ వందలాది రాకెట్లను ప్రయోగించినా ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించాయి.
2023 అక్టోబర్ 7 న ఇజ్రాయెల్ పై 2వేల రాకెట్లతో హమాస్ విరుచుకుపడింది. తర్వాత ఇజ్రాయెల్ సరిహద్దులను ధ్వంసం చేసిన హమాస్ మిలిటెంట్లు ఆ దేశంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆ దాడుల్లో 12 వందల మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. 240 మందిని హమాస్ మిలిటెంట్లు బంధించి తీసుకెళ్లారు. ఆ ఘటన తర్వాత గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు హమాస్ మిలిటెంట్లు ప్రతిదాడులు చేశారు.
ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి
గాజాలోని ఉత్తర ప్రాంతం నుంచి వేల సంఖ్యలో ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లడం చర్చనీయాంశమైంది. యుద్ధం ప్రారంభమయ్యాక సైన్యాన్ని నెతన్యాహు సర్కారు వెనక్కి పిలవడం ఇదే తొలిసారి కావడం వల్ల దీనిపై రకరకాల ఊహాగానాలోస్తున్నాయి. అయితే ఉత్తర ప్రాంతంలో ఆపరేషన్ పూర్తయిందని, దక్షిణ ప్రాంతంపై దృష్టి సారించడానికే సైన్యం ఉపసంహరణ చేపట్టామని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు యుద్ధ తీవ్రతను తగ్గించాలని ఆయుధాలను అందిస్తున్న మిత్రదేశమైన అమెరికా నుంచి ఒత్తిడి పెరగడమూ ఇజ్రాయెల్ ఈ చర్యలు చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది.