Israel Hamas War 2023 : ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ జరిపిన నరమేధం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పసిపిల్లలు, మహిళలను కూడా చూడకుండా అతి కిరాతంగా వారిని చంపేశారు. ఆ భయానక వీడియోలను హమాస్ మద్దతుదారులే సోషల్ మీడియాలో పోస్టు చేసుకొంటున్నారు. ఘటనా స్థలాల్లోని దృశ్యాలు జాంబీ సినిమా సీన్లను తలపిస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
శనివారం దాదాపు 3 వేల మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అంచనా వేసింది. వీరిలో 1500 మందిని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు హతమార్చగా.. మరో 1500 మంది తిరిగి గాజాకు పారిపోయినట్లు భావిస్తున్నారు. వందల మందిని బందీలుగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు అతి దారుణంగా చంపేశారని ఐడీఎఫ్ ప్రకటించింది. చిన్నారుల తలలు తెగనరికారని, మహిళలు, పిల్లల చేతికి సంకెళ్లు వేసి వారి నుదిటిపై కాల్పులు జరిపి చంపేశారని వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు ఆ దారుణాలను స్వయంగా చూసి చెప్పినట్లు వెల్లడించింది. హమాస్ మిలిటెంట్లు చిన్నారుల తలలు నరికి చంపినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని IDF పేర్కొంది.
హమాస్ దాడులకు పాల్పడిన ప్రాంతాలకు ఇజ్రాయెల్ బలగాలు వెళ్లి చూస్తే అక్కడ జాంబీ సినిమాలాంటి భయానక దృశ్యాలు కన్పించినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి జొనాథన్ కాన్రికస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదుల చెరలో దాదాపు 150 మంది ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులు బందీలుగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన గాజాలో దాడులు మరింత తీవ్రం చేసేందుకు ఇజ్రాయెల్ సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా యుద్ధకాల అత్యవసర సమైక్య ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీల ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు బుధవారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హమాస్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. గాజాలో అతిత్వరలో క్షేత్రస్థాయిలో దాడులు చేపడతామన్నారు. హమాస్ గ్రూప్ ఉనికి ఈ భూమిపైనే లేకుండా చేస్తామన్నారు. ప్రతి హమాస్ సభ్యుడు మూల్యం చెల్లించాల్సిందేనని వ్యాఖ్యానించారు.