Israel Enters Gaza :హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్న ఇజ్రాయెల్ సైన్యాలు.. గాజాలో అడుగుపెట్టాయి. హమాస్ స్థావరాలపై గత వారం రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్.. శుక్రవారం నేరుగా ఉత్తర గాజాలో ప్రవేశించి భూతల దాడులు ప్రారంభించాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటెంట్లతో పోరాడేందుకు, ఆయుధాలను ధ్వంసం చేయడానికి, బందీలుగా పట్టుకున్న వారిని వెతకడం కోసం తమ సైన్యం వెళ్లిందని వెల్లడించింది.
అయితే 24 గంటల్లోగా ఉత్తర గాజాను విడిచి వెళ్లిపోవాలని అక్కడున్న 11 లక్షల మందిని శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. గడువులోగా వెళ్లకపోతే తర్వాతి జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. దీంతో ప్రాణభయంతో అనేకమంది వలసబాట పట్టారు. ఇళ్లను ఖాళీ చేసి దక్షిణ గాజా ప్రాంతాలకు వెళుతున్నారు. అయితే గాజా సిటీ నుంచి వెళ్లిపోతున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడం వల్ల 70 మంది మృత్యువాత పడ్డారని హమాస్ అధికారులు తెలిపారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులేనని పేర్కొన్నారు.
Israel Hamas War Update :గాజా నుంచి తప్పించుకోడానికి ఈజిప్టు సరిహద్దులో ఉన్న రాఫా క్రాసింగ్ ఏకైక మార్గం. కానీ దాన్ని కూడా సోమవారం మూసేశారు. దీంతో అక్కడికి చేరుకున్న శరణార్థులు ఈజిప్టు అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇలా ఎదురచూస్తున్న వారిలో ఓ భారతీయ కుటుంబం కూడా ఉంది. ఇజ్రాయెల్ హెచ్చరిక తర్వాత.. గాజాలో నివాసం ఉండే జమ్ముకశ్మీర్ వాసి లుబ్నా నజీర్ షాబూ అనే మహిళ తన కుటుంబంతో సహా రాఫా క్రాసింగ్ వద్దకు చేరుకుంది.
"నేను నా భర్త, కుమార్తెతో ఇంటి నుంచి బయలుదేరాను. ఈజిప్టు సరిహద్దుకు సమీపంలో ఉన్న గాజా దక్షిణ భాగానికి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. ఇజ్రాయెల్ బాంబు దాడులలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. రవాణా కూడా ప్రధాన సమస్య" అని లుబ్నా నజీర్ షాబూ అక్కడి పరిస్థితిని వివరించారు. ఈజిప్టులో తన మరో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారని చెప్పిన లుబ్నా నజీర్.. ఆ దేశం అనుమతించే వరకు ఇక్కడే వేచి చూస్తామని తెలిపింది.