Israel Attack On Gaza Today :కాల్పుల విరమణ శుక్రవారం ఉదయంతో ముగియడం వల్ల గాజాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో 178 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు ఏర్పడతాయని యూఎన్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి.
Israel Hamas Ceasefire Expires: అక్టోబర్ 24న ఇజ్రాయెల్- హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వల్ల వారం రోజుల పాటు దాడులు జరగలేదు. తొలుత నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, అనంతరం బందీల విడుదల కోసం ఈ వ్యవధిని పెంచారు. దీంతో ఇరువైపుల నుంచి దాడుల జరగలేదు. ఈ ఒప్పందం శుక్రవారం ఉదయంతో ముగిసింది. హమాస్ తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులకు దిగింది. దీంతో బందీల విడుదల ఆగిపోయింది.
కాల్పులు మళ్లీ కొనసాగడంపై అమెరికా, ఐక్యరాజ్యసమితి స్పందించాయి. గాజాలో దాడులను ఆపాలని, కాల్పుల విరమణను పునరుద్ధరించాలని యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్, వైట్‌హౌస్ ఇరుపక్షాలను కోరాయి. మనవతాకోణంలో సహాయం చేసేందుకు ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఖతార్ దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు యూఎస్ జాతీయ భద్రతా కౌన్సిల్ అధికార ప్రతినిధి తెలిపారు.