Israel Attack on Gaza Hospital : గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 500 మంది దుర్మరణం - గాజా ఆస్పత్రిపై దాడి
By PTI
Published : Oct 17, 2023, 11:05 PM IST
|Updated : Oct 18, 2023, 6:54 AM IST
23:03 October 17
Israel Attack on Gaza Hospital : గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 500 మంది దుర్మరణం
Israel Attack on Gaza Hospital :హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శిథిలాల కింద అధిక సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారని పేర్కొంది. దాడి జరిగిన సమయంలో ఆస్పత్రిలో గాయపడిన వారితో పాటు అధిక సంఖ్యలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఆస్పత్రి భవనం ధ్వంసమై చెల్లచెదురుగా పడిన శరీర భాగాలు ఉన్నట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుంది. ఆసుపత్రిపై దాడి విషయంలో తీవ్ర విమర్శలు రాగా.. గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. పాలస్తీనా ప్రయోగించిన రాకెట్ వల్లే.. ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని పేర్కొంది. ఇప్పటివరకు గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 3 వేలకుపైగా ప్రజలు చనిపోగా.. హమాస్ దాడుల్లో 14 వందల మంది ఇజ్రాయెల్ వాసులు మరణించారు.
మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్ అక్కడ కూడా బాంబు దాడులు చేస్తోంది. మంగళవారం దక్షిణ గాజాపై చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనా వాసులు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. ఇటు లెబనాన్ సరిహద్దులోనూ మంగళవారం ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణ నెలకొంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గాజాకు సాయం అందించడానికి మధ్యవర్తుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది.
బైడెన్ తీవ్ర సంతాపం.. ఇజ్రాయెల్‌కు సెక్యూరిటీ టీం
మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ఇజ్రాయెల్ రానున్నారు. జోర్దాన్‌లోనూ ఆయన పర్యటించనున్నారు. అరబ్ నేతలతో సమావేశమవుతారు. ఆస్పత్రిపై జరిగిన దాడిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు జో బైడెన్. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే.. జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా 2, ప్రధాని నెతాన్యాహుతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు తమ దేశ భద్రతా బృందాన్ని అక్కడికి పంపించనున్నట్లు చెప్పారు. మరోవైపు ఆసుపత్రిపై దాడి నేపథ్యంలో.. బైడెన్‌తో సమావేశానికి వెళ్లరాదని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ నిర్ణయించినట్లు సమాచారం.