ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా ఎన్నో ఆంక్షలను విధించి అమలు చేస్తుండగా.. ఏకంగా ఆ దేశం నుంచే ఆయుధ పరికరాలు అక్రమ మార్గాల్లో తరలిపోతున్న విషయం వెలుగు చూసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన బైడెన్ ప్రభుత్వాధికారులు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాల గుట్టును ఛేదించారు. న్యూయార్క్, కనెక్టికట్‌లలో విడివిడిగా తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. నిందితులు అమెరికా కంపెనీల నుంచి ఆయుధ సాంకేతికతలను సేకరించి ఇవ్వడం ద్వారా సంపన్న రష్యా వ్యాపారవేత్తల నుంచి అక్రమ మార్గాల్లో భారీ మొత్తాల్లో నగదును పొందుతున్నారని అభియోగాల్లో అధికారులు ఆరోపించారు. పుతిన్ అనుచరులతో పాటు రష్యా సంస్థలు, వ్యాపారవేత్తలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్‌లోని రణ క్షేత్రాల్లో లభించిన పరికరాలను పరిశీలించినప్పుడు అమెరికా నుంచి ఆయుధ వ్యవస్థలు దొంగ రవాణా అవుతున్న విషయం బయటపడింది. రష్యాకు తరలిస్తున్న అణ్వాయుధ సాంకేతిక పరిజ్ఞానం మార్గమధ్యలో లాత్వియాలో పట్టుబడిందని కూడా అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. న్యూయార్క్‌లో అభియోగాలు నమోదైన అయిదుగురు నిందితులూ రష్యన్ జాతీయులే. వీరిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. కనెక్టికట్‌లో కేసులు నమోదైన నలుగురు నిందితుల్లో ఒకరు ఉక్రెయిన్ వాసి కాగా ముగ్గురు లాత్వియా జాతీయులు. రష్యాకు అక్రమంగా తరలిస్తున్న పరికరాల్లో బాలిస్టిక్, హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థల్లో, యుద్ధ విమానాల్లో వినియోగించే అధునాతన సెమీకండక్టర్లు, మైక్రోప్రాసెసర్లూ ఉన్నాయి. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా... ఆయుధ వ్యవస్థల్లో వినియోగించే పరికరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోందని స్పష్టమవుతోందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో తీవ్రమైన విద్యుత్ కష్టాలు
విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలపై రష్యా దాడులు ముమ్మరం కావడంతో ఉక్రెయిన్‌లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో బంకర్లలో తలదాచుకుంటున్న ఆ దేశ ప్రజల ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తమ దేశంలోని విద్యుత్తు వ్యవస్థల్లో 40శాతానికి పైగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థలూ ధ్వంసమయ్యాయని వెల్లడించారు. శీతాకాలం ప్రారంభం కావడంతో నివాస ప్రాంతాలను వెచ్చగా ఉంచేందుకు విద్యుత్తు సరఫరా ఎంతో కీలకం. దీంతో పగటి పూట విద్యుత్తు సరఫరాలో కోత విధిస్తున్నారు.