తెలంగాణ

telangana

ETV Bharat / international

'3 దశాబ్దాల రాజకీయ అస్థిరతను భారత్​ ముగించింది'

ఒక్క బటన్​ నొక్కడం ద్వారా మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతను భారత ప్రజలు ముగించారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మూడో రోజుల ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన.. జర్మనీలోని ప్రవాసులతో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi in Berlin
modi europe trip

By

Published : May 3, 2022, 1:04 AM IST

Updated : May 3, 2022, 6:54 AM IST

ఒక్క బటన్ నొక్కడం (ఓటు వేయడం) ద్వారా మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతకు భారత్​ చరమగీతం పాడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్​లో ప్రవాస భారతీయులతో సమావేశం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాను బెర్లిన్​కు వచ్చింది తన గురించి లేదా తన ప్రభుత్వం గురించి మాట్లాడటానికి కాదని అన్నారు.

"కోట్లాది భారతీయుల సామర్థ్యం గురించి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నా. వారి గొప్పతనాన్ని కీర్తించాలని భావిస్తున్నా. కోట్లాది భారతీయులంటే.. భారత్​లో ఉన్నవారు మాత్రమే కాదు.. ఇక్కడ నివసిస్తున్నవారితో పాటు ప్రపంచం నలుమూలలా ఉన్న భరతమాత పిల్లలు కూడా"

-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

"ఒక్క మీట నొక్కడం ద్వారా దేశంలోని గత మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతను భారత ప్రజలు అంతం చేశారు. 30 ఏళ్ల తర్వాత 2014లో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పడింది. 2019లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని మరింత బలపరిచారు." అని మోదీ అన్నారు.

ప్రభుత్వ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడం ద్వారా సరికొత్త భారత్‌ అవిష్కృతమైందని, దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలుస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో సహకారమందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 2014 వరకు భారత్‌లో 200 నుంచి 400 వరకు మాత్రమే అంకుర సంస్థలు(స్టార్టప్స్‌) ఉండగా నేడు వాటి సంఖ్య 68వేలకు చేరిందని తెలిపారు.

.

గత ఏడెనిమిదేళ్లలో భారత ప్రభుత్వం రూ.22లక్షల కోట్లను వివిధ పథకాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేసిందని చెబుతూ.. పరిపాలనలో ఆధునిక సాంకేతికతను సమ్మిళితం చేయడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. డిజిటల్‌ చెల్లింపుల విధానం విజయవంతమైన తీరును విడమరిచి చెప్పారు. ప్రజలు చొరవ తీసుకోవడం ద్వారానే దేశ పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

"21వ శతాబ్దం భారత్‌కు ఎంతో ముఖ్యమైనది. తనకు కావాల్సింది ఏమిటో దేశం నిర్ణయించుకుని, ఆ దిశగా దృఢంగా అడుగులేస్తోంది. సరికొత్త పథంలో నడుస్తూ లక్ష్య సాధన వైపుగా వెళ్తోంది" అని మోదీ వెల్లడించారు. 'భారత్‌ మాతకి జై' అంటూ ఎన్నారైలు చేసిన నినాదాలతో సమావేశ ప్రాంగణం దద్దరిల్లింది.

ఇదీ చూడండి:రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంలో విజేతలు ఉండరు: మోదీ

Last Updated : May 3, 2022, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details