India china Ladakh news: భారత్-చైనా మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసిన లద్ధాఖ్ వద్ద డ్రాగన్ సేన తన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. ఒకపక్క సైనిక స్థాయి చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు భారత్‌తో వాస్తవాధీనరేఖ వద్ద సైనిక మౌలిక వసతులను చైనా భారీస్థాయిలో పెంచేస్తోంది. మొత్తంగా హిమాలయ సరిహద్దుల్లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. ఆయుధాల మోహరింపులతో పాటు వైమానిక స్థావరాలు, రోడ్లను పెద్ద ఎత్తున ఆధునీకరిస్తోంది. చైనా ఇటీవల ప్యాంగాంగ్ సరస్సుపై.. బ్రిడ్జి నిర్మించినట్లు జనవరిలో వెలువడిన శాటిలైట్ చిత్రాల్లో వెలుగు చూసింది. భారత్-చైనా సైన్యాల ఘర్షణ సందర్భంగా కొన్ని కీలక ప్రాంతాల్లో.. అక్రమంగా తిష్టవేసిన డ్రాగన్ సైన్యం..వెనక్కి వెళ్లేందుకు మొండికేస్తోంది. భారత్ సైతం ధీటుగా పలు ప్రాంతాల్లో మోహరించడంతో చైనాకు మింగుడు పడడంలేదు. ఈ నేపథ్యంలో చర్చలంటూనే.. తన విస్తరణ వాదాన్ని కొనసాగించేందుకు డ్రాగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.
లద్ధాఖ్ సరిహద్దుల్లో చైనా మౌలిక వసతులు ఆందోళన కలిగించే అంశమని అమెరికా పసిఫిక్ కమాండ్‌కు చెందిన ఉన్నత సైన్యాధికారి జనరల్ చార్లెస్ ఫ్లిన్ పేర్కొన్నారు. చైనాది అస్థిరపరిచే, విస్తరణవాద వైఖరి అని ఫ్లిన్ అభివర్ణించారు. చైనా పశ్చిమ థియోటర్ కమాండ్ హిమాలయ సరిహద్దుల్లో.. ఆందోళనర స్థాయిలో మౌలిక సౌర్యాలను అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. కొందరు ఎంపిక చేసిన పాత్రికేయులతో.. సంభాషణ సందర్భంగా ఆయన విషయాలను వెల్లడించారు. చైనా కపటవైఖరి, ఆక్రమణవాదం.. ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలేదని ఫ్లిన్ వ్యాఖ్యానించారు. చైనా కుటిలనీతిని, నీతిబహ్యమైన చర్యలను అడ్డుకునేందుకు భారత్,అమెరికా కలిసి తీసుకుంటున్న చర్యలు ఉపకరిస్తాయని భావిస్తున్నట్లు జనరల్ ఫ్లిన్ చెప్పారు.