India Canada Issue Evidence :కెనడాతో నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనపై దిల్లీ వైఖరిని కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పునరుద్ఘాటించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను సమర్థించే ఆధారాలను బయటపెట్టాలని కోరారు. ఇప్పటివరకు కెనడా గానీ, దాని మిత్ర దేశాలు గానీ నిజ్జర్ హత్యకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలు చూపలేదని నొక్కి చెప్పారు. అంతేకాకుండా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ కేసు దర్యాప్తునకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు కెనడా మీడియాతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
కెనడా సమాచారం అందించలేదు..
ఈ కేసు దర్యాప్తులో వారికి (కెనడా అధికారులకు) సహాయపడటానికి తమకు నిర్దిష్టమైన సమాచారం అందించలేదని సంజయ్ కుమార్ తెలిపారు. 'సాక్ష్యాలు ఎక్కుడ ఉన్నాయి? దర్యాప్తు ముగిసిందా? నేను మరో అడుగు ముందుకేసి చెబుతున్నాను.. ఈ దర్యాప్తు ఇప్పటికే కలుషితమైపోయింది. భారత ఏజెంట్లు నిజ్జర్ హత్య వెనుక ఉన్నారని చెప్పడానికి ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి' అని సంజయ్ కుమార్ ఆరోపించారు.
'దౌత్యవేత్తల సంభాషణలకు రక్షణ ఉంటుంది'
మరోవైపు, నిజ్జర్ హత్య కేసులో భారత్ ఉందన్న ఆరోపణలను హైకమిషనర్ ఖండించారు. దౌత్యవేత్తల మధ్య జరిగిన సంభాషణలకు రక్షణ ఉంటుందని.. వాటిని సాక్ష్యాలుగా ఉపయోగించలేమని తెలిపారు. 'మీరు చట్ట విరుద్ధమైన ట్యాపింగ్, సాక్ష్యాధారాల గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు దౌత్యవేత్తల మధ్య జరిగిన సంభాషణలు అన్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం సురక్షితమైనవి. మీరు ఆ సంభాషణలను ఎలా రికార్డ్ చేశారో నాకు చూపించండి. ఎవరైనా ఆ వాయిస్‌లను మిమిక్రీ చేయలేదని నాకు చూపించండి' అని నిలదీశారు.
"కెనడాలో ఉన్న వాంటెడ్ జాబితాలోని వారిని భారత్‌కు అప్పగించాలని ఒట్టావాకు గత ఐదారేళ్లుగా 26 అభ్యర్థనలు చేశాం. వాటిపై కెనడా తీసుకునే చర్యల కోసం ఎదురుచూస్తున్నాం. నాతో పాటు మిగతా దౌత్యవేత్తల భద్రతపై ఆందోళనలున్నాయి. దౌత్యపరంగా ఎదురైన సమస్యలను ఇరు దేశాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఖలిస్థాన్ మద్దతుదారులను కెనడా నియంత్రించాలని భారత్ ఆశిస్తోంది. భారత్‌ను ముక్కలు చేయడానికి ప్రయత్నించే, భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను సవాలు చేయాలనుకుంటున్న కెనడా పౌరులు కెనడా గడ్డను ఉపయోగించడానికి ఒట్టావా అనుమతించకూడదు."
--సంజయ్ కుమార్ వర్మ, కెనడాలోని భారత హైకమిషనర్