Imran Khan News: 'దేవుడి దయవల్ల.. ఈ వ్యక్తి అధికారంలో కొనసాగకూడదు' అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేవనెత్తాయి. పరాయి దేశాల్లో ప్రభుత్వాలను మార్చేందుకు అమెరికా యత్నిస్తోందనే అర్థం ప్రపంచంలోకి వెళ్లింది. శ్వేతసౌధం వెంటనే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. బైడెన్ ఉద్దేశం అది కాదని తేల్చిచెప్పింది. కానీ, ఈ వ్యాఖ్యలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అందిపుచ్చుకొన్నారు. తనను అధికారం నుంచి దింపేందుకు బైడెన్ నేతృత్వంలోని అమెరికా పాలకులు ప్రయత్నిస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఇమ్రాన్ అధికారంలో కొనసాగితే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా అధికారులు హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
బైడెన్ అమెరికాలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమ్రాన్‌ను దూరం పెడుతూ వచ్చారు. పాక్ ఎంత ప్రయత్నించినా ఇమ్రాన్‌తో మాట్లాడేందుకు జో బైడెన్ అంగీకరించలేదు. కానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో నిర్వహించిన 'డెమోక్రసీ సమ్మిట్'కు ఇమ్రాన్‌ను ఆహ్వానించారు. కానీ, చైనాకు మద్దతుగా ఇమ్రాన్ దీనిలో పాల్గొనేందుకు తిరస్కరించారు. అదే సమయంలో తాలిబన్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఉక్రెయిన్ ఆక్రమణ సమయంలో రష్యాలో పర్యటించి వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కావడం వల్ల అమెరికాతో దూరం మరింత పెరిగింది. ఇప్పుడు ఇమ్రాన్ ఈ విరోధాన్నే తన ఆరోపణలకు ఆధారంగా చూపిస్తున్నారు.
- తిరస్కరించిన అమెరికా :ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను అమెరికా తిరస్కరించింది. వీటిపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్‌ప్రైస్ స్పందించారు. ఆ ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు. "పాకిస్థాన్‌లోని పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. అక్కడి రాజ్యాంగ విధానాలకు, చట్టానికి తమ దేశం పూర్తి మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.
- ఇమ్రాన్‌కు భారీ వ్యతిరేకత :మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఏకమయ్యాయి. ఫలితంగా 342 మంది ఉన్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాసం వీగిపోవాలంటే 172 ఓట్లు ఇమ్రాన్‌కు అవసరం. కానీ, ఆయనకు వ్యతిరేకంగా 196 ఓట్లు ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ కథనంలో పేర్కొంది. దీంతో ఖాన్ ఓటమి ఖాయమైందని పేర్కొంది.