Rishi Sunak on India: బ్రిటన్ విద్యార్థులు, కంపెనీలు భారత్‌కు సులభంగా రావడానికి రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మార్చాలని భావిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్ తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీలోని భారతీయ బ్రిటిష్ సభ్యులతో లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రసంగించారు. ''ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, బలమైన, సురక్షితమైన దేశాన్ని నిర్మించడానికి నన్ను ప్రధానిగా ఎన్నుకోండి. మనం బ్రిటన్-ఇండియాల మధ్య జీవ వారధులం. భారత్‌లో మన వస్తువులు విక్రయించడానికి, అక్కడ పనులు చేయడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఆ దేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బ్రిటన్ విద్యార్థులు అక్కడికి వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరముంది. మన కంపెనీలు, భారతీయ కంపెనీలతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ కోణంలోనే రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా మార్చాలని అనుకుంటున్నా'' అని వివరించారు.
''చైనా నుంచి ఎన్నో ఏళ్లుగా ఎదురవుతున్న ఆర్థిక, భద్రతాపరమైన ముప్పును బ్రిటన్ మరింత బలంగా ఎదుర్కోవాల్సి ఉంది. బ్రిటన్ ప్రధానిగా మిమ్మల్ని, మీ కుటుంబాలను సురక్షితంగా ఉంచడం నా ప్రథమ కర్తవ్యం'' అని సునాక్ తెలిపారు. తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ పన్నుల్లో కోత పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారని, అలా చేస్తే.. అతి తక్కువ పన్నులు చెల్లించే వారికి ఎలాంటి ప్రయోజనం దక్కుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సునాక్‌కు భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది.
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునాక్, సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థితో పోలిస్తే వెనుకంజలో కొనసాగుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేత పోటీలో లిజ్ ట్రస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ నేతను ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 2 వరకు మాత్రమే గడువుంది. అప్పటిలోగా ఆ పార్టీకి చెందిన టోరీలు పోస్టల్, ఆన్‌లైన్ ద్వారా తమ ఓట్లను వేయనున్నారు. సెప్టెంబర్ 5న తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా గెలిచిన అభ్యర్థే బ్రిటన్ నూతన ప్రధానిగా అదే రోజు బాధ్యతలు చేపడతారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ నేత పోటీలో ఉన్న ఇద్దరి నేతల మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతుండడంతో రానున్న 10 రోజుల్లోనే రిషి సునాక్ తనకు మరింత మద్దతు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.