Explosive Attack In Colombia: నైరుతి కొలంబియాలో పోలీసు వాహనంపై జరిగిన పేలుడు పదార్థాల దాడిలో 8 మంది అధికారులు మరణించారని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో శుక్రవారం తెలిపారు. ఈ దాడిని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఈ చర్యలు శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదని పెట్రో చెప్పారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా- పీపుల్స్ ఆర్మీ అనే గెరిల్లా గ్రూపు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కొలంబియా అధ్యక్షుడిగా ఆగస్టు 7న గుస్తావో పెట్రో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దేశ చరిత్రలో మొదటి వామపక్ష నాయకుడు. పేదరికాన్ని అరికడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే గెరిల్లా పోరాట యోధులతో చర్చలకు జరుపుతానని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులపై దాడి జరగడం గమనార్హం.