Electricity Crisis In Europe: ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇవే కరెంట్ కథలు వినిపిస్తున్నాయి! ప్రపంచ విద్యుత్ రంగంలో సంక్షోభ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన లిజ్ ట్రస్.. నోట వెలువడిన తొలిమాట కరెంటు సంక్షోభం గురించే! రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధానికి.. తాజాగా ప్రకృతి ప్రకోపం, తీవ్రమైన ఎండలు, ఐరోపాలో కరవు తోడవటంతో ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌రంగం సంక్షోభం దిశగా సాగుతోంది. ఆర్థికంగా అతిపెద్ద దేశాలనుకున్నవి కూడా.. తమ ప్రజలకు కరెంట్‌ను అందించటానికి ఆపసోపాలు పడుతున్నాయి.
విపరీతమైన వేసవి ఎండలతో యూరప్‌లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఎదుర్కొంటున్న గ్యాస్ కొరతకు ఇది ఆజ్యం పోసినట్లయింది. పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవటం ఆయా ప్రభుత్వాల వశం కావటం లేదు. ఐరోపాలో అందరికంటే ఎక్కువ అణు విద్యుత్ ఉత్పత్తి చేసే ఫ్రాన్స్ సైతం డిమాండ్‌ను తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటలీ గత 70 ఏళ్లలో ఎన్నడూ చూడని కరవును చూస్తోంది. 'ఐరోపా బ్యాటరీ'గా పేరొందిన నార్వే రిజర్వాయర్లు కూడా సగం ఖాళీ అయ్యాయి. ఐరోపా ఖండంలోనే అగ్రశ్రేణి విద్యుత్ ఎగుమతిదారైన నార్వే.. తన ఎగుమతుల్లో కోత విధిస్తోంది. దాదాపు సగం ఐరోపా తీవ్రమైన కరవును ఎదుర్కొంటోంది.
చైనాలో..
విపరీతమైన ఎండలు, వడగాడ్పులు, కరవు కారణంగా.. చైనా చీకట్లను ఆహ్వానిస్తోంది. ఆసియాలోని అతి పొడవైన నది యాంగ్జీలో నీరు 1865 తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో ఈసారి అడుగంటింది. అనేక చోట్ల ఇసుక మేటలు తేలాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన త్రీగార్జెస్ డ్యామ్ విద్యుత్ ప్లాంట్‌కూ దీన్నుంచే నీటి సరఫరా జరుగుతుంటుంది. అనూహ్యంగా నీటిమట్టాలు తగ్గటంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాల్లో కోత పడింది. విద్యుత్ ఉత్పత్తి 50శాతంపైగా తగ్గిపోయింది. వాటి ప్రభావం వినియోగదారులు, పరిశ్రమలపై కనిపిస్తోంది. చైనాలో చాలాచోట్ల ముఖ్యంగా.. సిచువాన్ రాష్ట్రంలో కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు పరిస్థితులు నెలకొన్నాయి. వాణిజ్య కేంద్రాలనూ ఎక్కువ సేపు మూసి ఉంచి.. కొన్ని గంటలే తెరచి ఉంచేందుకు అనుమతిస్తున్నారు. చాలా పరిశ్రమలను తాత్కాలికంగా మూసేశారు. షాంఘైలాంటి మెగా పట్టణాల్లోనూ లైట్లు, ఏసీలు, ఎస్కలేటర్లు నిలిపేస్తున్నారు. టయోటా తదితర కంపెనీలు తమ ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసేశాయి.
అమెరికాలో..
సహజ ఇంధనం ధరలు పెరగటంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే సగటున 15 శాతం పెరుగుదల ఉంది. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక మంది ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేకపోతున్నారు. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. అమెరికా నేషనల్ ఎనర్జీ అసిస్టెన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు బకాయిల్లో పడింది. ఆఫ్రికాలోనూ అనేక దేశాల్లో పెరిగిన ఇంధన ఛార్జీలను తగ్గించాలంటూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. దక్షిణాఫ్రికా, క్యూబాల్లో కరెంట్ కోతలు పెరిగాయి.