తెలంగాణ

telangana

ETV Bharat / international

మూడోసారి చైనా అధ్యక్షుడిగా షీ జిన్​పింగ్​.. పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం.. జెడాంగ్‌ తరవాత.. - మూడోసారి అధ్యక్షుడిగా ఎంపికైన జిన్​పింగ్

చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు చైనా పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అంతకుముందే గతేడాది జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు.

china jinping endorsement
china jinping endorsement

By

Published : Mar 10, 2023, 9:10 AM IST

Updated : Mar 10, 2023, 11:45 AM IST

చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా నిలవాలని భావిస్తున్న షీ జిన్‌పింగ్‌.. ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. తాజాగా బీజింగ్‌లో జరుగుతున్న14వ నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్-NPC స‌మావేశాల్లో భాగంగా ఆ దేశ పార్లమెంట్‌ చైనా అధ్యక్షుడిగా 69 ఏళ్ల జిన్‌పింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో మరో 5 ఏళ్లు అధ్యక్ష పీఠంపై జిన్‌పింగ్ కూర్చోనున్నారు. దీంతో చైనా జీవితకాల అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయన మార్గం సుగమం చేసుకున్నారు. 2,950 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో జిన్‌పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యధిక కాలం అధ్యక్ష పదవిని దక్కించుకున్న వ్యక్తిగా 69 ఏళ్ల జిన్‌పింగ్ నిలిచారు. వాస్తవానికి చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 ఏళ్లే అయినప్పటికీ.. 2018లో రాజ్యాంగాన్ని సవరించారు. దీంతోపాటు ఒక వ్యక్తి 2 కన్నా ఎక్కువసార్లు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేశారు.

మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్ బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఇక చైనా ఉపాధ్యక్షుడిగా జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడైన హాన్ జంగ్ ఎన్నిక‌య్యారు. ఇదే సమయంలో సెంట్రల్ మిలిట‌రీ క‌మీష‌న్-CMC ఛైర్మన్‌గా కూడా జిన్‌పింగ్ ఎన్నిక‌య్యారు. దీంతో ప్రపంచంలోనే 20 లక్షల సైనికులు గల అతిపెద్ద సైన్యమైన పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీకి అధిపతిగా నిలిచారు. ఐదేళ్లకోసారి జరిగే అధికార కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్‌చైనా-CPC సమావేశాల సందర్భంగా గతేడాది అక్టోబర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరోసారి జిన్‌పింగ్ ఎన్నికయ్యారు.

పదేళ్లకోసారి చైనా ప్రభుత్వ నాయకత్వ మార్పు జరిగే వేళ జరుగుతున్న ఈ ఏడాది NPC సమావేశాలు చాలా కీలకంగా మారాయి. ప్రస్తుత ప్రధాని లీ కెకియాంగ్ పదవీకాలం ఈ NPC సమావేశాల తర్వాత ముగియనుంది. ఆ స్థానంలో జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు లీ కియాంగ్‌ను శనివారం ఎన్నికోనున్నట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వానికి సంబంధించి కొన్ని వారాల ముందే జిన్‌పింగ్ నేతృత్వంలోని CPC నిర్ణయించింది. NPC ఆమోదం నామమాత్రంగా ఉంటుంది. జిన్‌పింగ్ నేతృత్వంలోని కొత్త నాయకత్వం ఈనెల 13న.. NPC వార్షిక సమావేశాల చివరి రోజు మీడియా ముందుకు రానుంది.

గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలకు 2,300 మంది హాజరుకాగా.. వీరిలో 370 మంది సభ్యులతో కూడిన సెంట్రల్​ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ఈ సెంట్రల్​ కమిటీ.. మరోసారి సమావేశమై 25 మంది నాయకులతో పొలిటికల్​ బ్యూరోను ఎన్నుకుంది. ఆ తర్వాత ఈ పొలిటికల్ బ్యూరో.. ఏడుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్​ కమిటీని ఎంపిక చేసింది. ఆ తర్వాత శక్తిమంతమైన స్టాండింగ్​ కమిటీ.. జనరల్​ సెక్రటరీ( పార్టీ అధ్యక్షుడు) పేరును ప్రకటించింది.

ఇవీ చదవండి :చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు..

నేపాల్​ కొత్త అధ్యక్షుడిగా రామ్​ చంద్ర.. 'ప్రచండ' ప్రభుత్వ భవిష్యత్తు సేఫ్​!

Last Updated : Mar 10, 2023, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details