తెలంగాణ

telangana

ETV Bharat / international

China Rejects Accreditation : చైనా కవ్వింపు చర్య.. ఆసియా క్రీడల్లో అరుణాచల్​ ప్లేయర్లకు నో ఎంట్రీ!.. భారత్​ స్ట్రాంగ్​ రిప్లై

China Rejects Accreditation : శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు క్రీడాకారులకు చైనా అనుమతి నిరాకరించింది. చైనా తీరుపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ చర్య క్రీడా స్ఫూర్తి, వాటి నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని మండిపడింది. బీజింగ్‌ చర్యకు నిరసనగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

China Rejected Accreditation For Indian Sports Players
China Rejected Accreditation For Indian Sports Players

By PTI

Published : Sep 22, 2023, 3:19 PM IST

Updated : Sep 22, 2023, 5:57 PM IST

China Rejects Accreditation : భారత్​లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్​ ప్రదేశ్​కు చెందిన కొందరు క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు కావాల్సిన అక్రిడిటేషన్​ను చైనా నిరాకరించింది. డ్రాగన్​ అధికారులు అవలంబిస్తున్న ఈ చర్యను భారత్​ తీవ్రంగా తప్పుబట్టింది. బీజింగ్‌ వివక్షపూరిత చర్యకు నిరసనగా ఆసియా క్రీడల కోసం శనివారం చైనా పర్యటనను భారత్​ రద్దు చేసుకుంటున్నట్లుగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ వెల్లడించారు.

ముందే అనుకొని చేశారు..
నివాస ప్రాతిపదికన భారతీయ పౌరుల పట్ల భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్న చైనా తీరును భారత్​ తీవ్రంగా ఖండించింది. ఆసియా క్రీడల స్ఫూర్తిని చైనా ఉల్లంఘిస్తోందని.. క్రీడా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి మండిపడ్డారు. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని.. ఇందులో భాగంగానే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆసియాక్రీడల నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కొందరు క్రీడాకారులను లక్ష్యంగా చేసుకొని, ముందే అనుకున్నట్లు, వివక్షపూరితంగా చైనా అధికారయంత్రాంగం వారికి అనుమతులను నిరాకరించినట్లు తమకు సమాచారం అందిందని బాగ్చీ తెలిపారు.

అరుణాచల్‌ప్రదేశ్‌ ఎప్పటికీ విడదీయరాని భాగం
తమ దీర్ఘకాల, సుస్థిర విధానానికి కట్టుబడి ఉంటూ నివాసం లేదా జాతుల ఆధారంగా భారత పౌరులను చైనా భిన్నంగా పరిగణించటాన్ని నిర్ధ్వందంగా తిరస్కరిస్తున్నట్లు అరిందమ్​ బాగ్చి పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ గతంలోనూ, ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో విడదీయరాని భాగమమని ఆయన తేల్చిచెప్పారు. చైనా ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన కొందరు భారత క్రీడాకారులకు అనుమతి నిరాకరించడంపై దిల్లీ.. బీజింగ్‌లో గట్టిగా నిరసన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

కిరణ్​ రిజిజు మండిపాటు!
"సెప్టెంబర్​ 23 నుంచి హాంగ్‌జౌలో జరగబోయే 19వ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన కొందరు అథ్లెట్ల వీసాలను చైనా నిరాకరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ చర్య క్రీడల స్ఫూర్తితో పాటు ఆసియా క్రీడల నిర్వహణను నియంత్రించే నియమాలను కూడా ఉల్లంఘిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది వివాదాస్పద భూభాగం కాదు, భారతదేశంలో విడదీయరాని భాగం. తమపై, తమ భూములపై చైనా పాల్పడుతున్న ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలను ఆ రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ జోక్యం చేసుకోవాలి." అని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్​ రిజిజు డ్రాగన్​ దేశంపై మండిపడ్డారు.

Last Updated : Sep 22, 2023, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details