తెలంగాణ

telangana

ETV Bharat / international

సరిహద్దులో ఘర్షణపై స్పందించిన చైనా.. ఏం చెప్పిందంటే? - ఇండియా చైనా ఘర్షణ

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో డిసెంబర్‌ 9న భారత్‌ దళాలాలతో జరిగిన ఘర్షణపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. సరిహద్దులో పరిస్థితి స్థిరంగానే ఉందంటూ చెప్పుకొచ్చింది. అన్ని ఒప్పందాలను భారత్‌ అమలు చేయాలని కోరింది.

China on India border clash
China on India border clash

By

Published : Dec 13, 2022, 5:14 PM IST

Updated : Dec 13, 2022, 9:48 PM IST

అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా సైన్యం దురాక్రమణకు యత్నించడంపై ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగిన వేళ.. డ్రాగన్‌ సర్కారు ఎట్టకేలకు మౌనం వీడింది. నెపాన్ని భారత సైన్యంపైకి నెడుతూ.. కట్టుకథతో ముందుకొచ్చింది. తవాంగ్‌ సెక్టార్‌లో ఈనెల 9న జరిగిన సైనిక ఘర్షణపై మొదట ఏమీ జరగనట్లే చెప్పుకొచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగానే ఉందని ఎలాంటి గొడవలు లేవన్నట్టుగా మాట్లాడింది. సరిహద్దు విషయాల్లో రెండు దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల్లో.. సామరస్యంగా చర్చలు జరుపుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌ చెప్పుకొచ్చారు. భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. చైనా ప్రతినిధి చాలా నెమ్మదిగా ఈ సమాధానం చెప్పారు.

సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని రెండు దేశాలూ కొసాగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా అధికారిక మీడియా కూడా రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ అంశంపై మౌనం వహించింది. అక్కడి పత్రికలు, ఛానెల్స్‌ నుంచి ఎలాంటి కథనాలు వెలువడలేదు. హాంగ్‌కాంగ్‌లోని.. ఓ టెలివిజన్‌ ఛానల్‌ మాత్రం భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిందనే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించిందంటూ ఓ వార్తను ప్రసారం చేసింది.

అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికల్లో ఈ కథనం వెలువడగా.. చైనా ఆర్మీ, విదేశాంగ శాఖ తప్పక స్పందించాల్సి వచ్చింది. భారత సైనికులే అక్రమంగా చైనాలో చొరబడేందుకు యత్నించారని, తమ సైన్యం చాలా హుందాగా వ్యవహరించిందని చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌లోని సీనియర్‌ కర్నల్‌ లాంగ్‌ షావోహువా ఓ ప్రకటన విడుదల చేశారు. తమ బలగాలు రోజూవారీ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. భారత సైన్యం రహదారిని దిగ్భందించి, చైనాలోకి చొరబడేందుకు యత్నించిందని ఆరోపించారు. చైనా సైన్యం హుందాగా వ్యవహరించడం వల్లే పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.

ఆ తర్వాత రెండు దేశాల సైనికులు.. ఆ ప్రాంతం వీడి వెనక్కు వెళ్లిపోయాయని తెలిపారు. భారత సైన్యం తమ బలగాలను నియంత్రించుకోవాలన్న ఆయన.. శాంతి నెలకొనేందుకు తమతో కలిసి పనిచేయాలంటూ సూక్తులు వల్లె వేశారు. చైనా విదేశాంగ శాఖ సైతం.. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు నిర్ధారించింది. రెండు వైపులా.. సైనికులకు స్పల్ప గాయాలు అయినట్లు తెలిపింది.

వాస్తవానికి తవాంగ్‌ సెక్టార్‌లో సుమారు 200 మంది చైనా సైనికులు మేకులతో కూడిన గదలాంటి ఆయుధాలు, కర్రలతో వచ్చి.. భారత సైనికులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అయితే భారత సైనికులు కూడా పెద్దసంఖ్యలో మోహరించడం సహా దీటుగా తిప్పికొట్టడం వల్ల.. చైనా సైనికులు వెనక్కు తగ్గారని సమాచారం. ఈ ఘర్షణలో రెండు దేశాలకు చెందిన సైనికులకు స్వల్ప గాయాలైనట్లు.. భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వం తెలిపాయి.

2020 జూన్‌లో గల్వాన్‌ లోయలోనూ.. చైనా సైన్యం ఇదే తరహాలో ఘర్షణకు దిగింది. అప్పుడు జరిగిన భీకర దాడిలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు అమరులు కాగా చైనా మాత్రం తమవైపు జరిగిన ప్రాణ నష్టాన్ని వెల్లడించలేదు. చైనాకు చెందిన 40 మంది జవాన్లు చనిపోయారని అమెరికా సహా పలు దేశాల నిఘావర్గాలు వెల్లడించాయి.

Last Updated : Dec 13, 2022, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details