తెలంగాణ

telangana

ETV Bharat / international

తీవ్ర కరవు, ప్రజల నానా పాట్లు, వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్​ - China Electricity Problems

China Severe Drought తీవ్ర కరవుతో చైనా ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద నది అయిన యాంగ్జీలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. దాంతో పాటు దేశంలో విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఫ్యాక్టరీలకు సైతం పూర్తిగా సెలవులిచ్చారు. చేసేదేమి లేక కృత్రిమ వర్షాలు కురిసేలా మేఘాలను ప్రేరేపించేందుకు చైనా అధికారులు రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు.

China Rainfall
China Rainfall

By

Published : Aug 19, 2022, 12:42 PM IST

China Rainfall: చైనాలో కరవు తీవ్రంగా ఉంది. అక్కడ హీట్‌ వేవ్‌ కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద నదిలో నీటి నిల్వలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. మరోవైపు విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. హైడ్రోపవర్‌ ఉత్పత్తి సాధ్యం కాక.. ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలకు పూర్తిగా సెలవులు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలే కొవిడ్‌ లాక్‌డౌన్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు కరెంటు కోతలు గుదిబండలా మారాయి. దీంతో చైనా అధికారులు కృత్రిమ వర్షాలు కురిసేలా మేఘాలను ప్రేరేపించేందుకు యత్నాలు మొదలు పెట్టారు.

1961 తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు చూడలేదు..
Severe Drought In China: చైనాలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ప్రభావం చూపుతున్నాయి. గత రెండు నెలల నుంచి రికార్డు స్థాయిలో వేడి నమోదవుతోంది. 1961 తర్వాత ఈ స్థాయిలో ఎండలు నమోదు కావడం ఇదే అని 'ఎర్త్‌.ఓఆర్‌జీ' కథనంలో పేర్కొంది. ఇదే పరిస్థితి కనీసం ఆగస్టు 26 వరకు కొనసాగుతుందని అంచనావేస్తున్నారు.

యాంగ్జీ నదిలో నీటికి కటకట..
ఆసియాలోనే అతిపెద్ద నది అయిన యాంగ్జీలో నీటి మట్టం ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది. గత రెండు నెలల నుంచి తీవ్రమైన ఎండల దెబ్బకు నది చాలా భాగం ఎండిపోయి దర్శనమిస్తోంది. దీనికి తోడు వర్షపాతం గత 60 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి పడిపోయిందని గ్లోబల్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. నైరుతీ చైనాలో సిచువాన్‌ ప్రావిన్స్‌పై కరవు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలోని 51 చిన్న నదులు , 24 రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయినట్లు చైనా పత్రిక పేర్కొంది.

నీటి నిల్వలు పడిపోయిన యాంగ్జీ నది

భారీగా కరెంటు కోతలు..
China Electricity Problems: చైనాలోని మూడో అతిపెద్ద ప్రావిన్స్‌ అయిన సిచువాన్‌ ఏడేళ్ల క్రితం నుంచి అత్యధికంగా హైడ్రోపవర్‌ పై ఆధారపడుతోంది. దీంతో ఇక్కడ 80శాతం ఈ విద్యుత్తునే వినియోగిస్తారు. ఇప్పుడు వర్షాభావం కారణంగా తీవ్ర కొరతను ఎదుర్కొంటుండటంతో ఈ ప్రావిన్స్‌లోని హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఉత్పత్తి పడిపోయిందని సిచువాన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కంట్రోల్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ ఝూజిన్‌ వెల్లడించారు. మరోవైపు చైనాలో బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి.

దీంతో గ్రిడ్‌ నుంచి విద్యుత్తు మళ్లింపు సాధ్యం కావడంలేదు. దాదాపు 54 లక్షల మంది జనాభా ఉన్న డైజూ నగరం కొన్నాళ్ల క్రితం తీవ్రమైన కరెంటు కోతను ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ ప్రావిన్స్‌ రాజధాని చెంగ్డూలో సబ్‌వే స్టేషన్ల నిర్వహణ కోసం వీధిలైట్లను ఆపివేస్తున్నారు. దీంతోపాటు డైజూ నగరంలో కూడా పొదుపు చర్యలు చేపట్టారు. ఈ ప్రావిన్స్‌లోని ఫ్యాక్టరీలు, షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులకు కరెంటును రేషన్‌ విధానంలో కేటాయిస్తున్నారు. విద్యత్తు ఎక్కువగా వినియోగించే ఫ్యాక్టరీలను తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఫలితంగా టొయోటా, ఫాక్స్‌కాన్‌, చైనా బ్యాటరీల తయారీ సంస్థ కాంటెంపరరీ ఆంప్రెక్స్‌ టెక్నాలజీ సంస్థల కర్మాగారాలు నిలిచిపోయినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనంలో వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 26 సెంటీగ్రేడ్‌కు తక్కువలో వాడకూడదని నిబంధన విధించింది.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రెడ్‌ అలర్ట్‌..
చైనాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటికే 138 నగరాల్లో అత్యధిక ప్రమాద హెచ్చరిక అయిన రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. తాజాగా బుధవారం మరో 373 నగరాల్లో ఆరెంజ్‌ అలర్ట్​ను(రెండో అతితీవ్ర ప్రమాద హెచ్చరిక) జారీ చేశారు. గురువారం దేశవ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. గత సోమవారంతో హీట్‌వేవ్‌ మొదలై 64 రోజులు దాటింది. దీనిపై వాతావరణ శాఖ స్పందిస్తూ ఇది రికార్డు అని.. భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారవచ్చని హెచ్చరించింది. మొత్తం 262 వెదర్‌స్టేషన్లలో 40 డిగ్రీలకు పైగా రికార్డు అవుతుండగా.. మరో 8 చోట్ల 44 డిగ్రీలను దాటేసినట్లు పేర్కొంది.

యాంగ్జీ నదీపరీవాహక ప్రాంతంలో మేఘమథనంపై దృష్టి..
చైనా ఈ కరవును తట్టుకోవడానికి మేఘమథనంపై దృష్టిపెట్టింది. చైనా విమానాలు సిగరెట్‌ సైజ్‌లోని సిల్వర్‌ అయోడైడ్‌ రాడ్లను మేఘాల్లోకి వదులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1940 నుంచి క్లౌడ్‌ సీడింగ్‌ జరుగుతోంది. కాకపోతే చైనాలో ప్రస్తుతం భారీ ఎత్తున చేపడుతున్నారు. యాంగ్జీ పరీవాహక ప్రాంతంలో చాలాచోట్ల మేఘమథనం మొదలుపెట్టారు. మరోవైపు హుబే ప్రావిన్స్‌లో క్లౌడ్‌ సీడింగ్‌ ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇక్కడ కూడా అర కోటి మంది కరవుతో ఇబ్బందులు పడుతున్నారు. 1,50,000 మందికి తాగునీటి కొరత ఉండగా.. 4,00,000 హెక్టార్ల పొలాలకు నీరు లేదు. ఈ సారైనా వరుణుడు కరుణించి డ్రాగన్‌ దాహం తీరుస్తాడేమో చూడాలి.

ఇవీ చదవండి:ప్రపంచమంతటా బానిసత్వం, భారత్​లో బలవంతపు పెళ్లిళ్లు, ఐరాస నివేదిక

మరో వివాదంలో ఆ దేశ ప్రధాని, డ్రగ్స్​ సేవించి డ్యాన్స్​ చేశారంటూ

ABOUT THE AUTHOR

...view details