Canada Expels Indian Diplomat for Khalistan Leader Killed : ఖలిస్థాన్ వ్యవహారం భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన చిచ్చు రేపింది. ఖలిస్థాన్ మద్దతుదారుడైన ఓ సిక్కు నాయకుడి హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అక్కడి మన దౌత్యవేత్తను కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. దీనిపై మోదీ ప్రభుత్వం కూడా ఘాటుగానే బదులిచ్చింది. భారత్‌లో ఉంటున్న కెనడా దౌత్యవేత్తను ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
పార్లమెంటులో ప్రస్తావించిన కెనడా ప్రధాని..
ఖలిస్థాన్ మద్దతుదారుడైన సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వ్యవహారాన్ని సోమవారం కెనడా పార్లమెంటులో ప్రస్తావించారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో. భారత్‌పై వస్తున్న ఆరోపణలను తమ నిఘా సంస్థలు పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. గత వారం దిల్లీ వేదికగా జరిగిన జీ-20శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో.. సిక్కు వ్యక్తి హత్య గురించి ప్రస్తావించానని ట్రూడో తెలిపారు. ఇందులో భారత ప్రభుత్వ ప్రమేయం ఉంటే అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. విచారణకు సహకరించాలని తాను మోదీకి చెప్పానని ఆయన వివరించారు.
నిఘా విభాగం అధిపతి బహిష్కరణ..
కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిగంటలకే కీలక ప్రకటన చేసింది ఆ దేశ విదేశాంగ శాఖ. కెనడా భారత రాయబార కార్యాలయంలో పని చేసే నిఘా విభాగం అధిపతి పవన్ కుమార్ రాయ్‌ను తమ దేశం నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ స్పష్టం చేశారు. హత్య ఆరోపణలపై దర్యాప్తులో భారత ప్రభుత్వం తమకు సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
మన దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడంపై అంతే దీటుగా బదులిచ్చింది మోదీ ప్రభుత్వం. భారత్‌లో ఉంటున్న కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఐదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కెనడా హైకమిషరన్ను దిల్లీలోని తమ కార్యాలయానికి పిలిచి మరీ ఈ విషయం తెలియజేసింది భారత విదేశాంగ శాఖ. "కెనడా హైకమిషనర్‌కు ఈరోజు(మంగళవారం) సమన్లు జారీ చేశాం. భారత్‌లో పని చేస్తున్న ఓ సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయనకు తెలిపాం. ఆ అధికారి.. ఐదు రోజుల్లోగా దేశం విడిచివెళ్లాలని సూచించాం. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో కెనడా ప్రభుత్వ జోక్యం పట్ల భారత ప్రభుత్వం ఆందోళనలకు ఈ నిర్ణయం అద్దంపడుతుంది" అని ఓ ప్రకటన ద్వారా తెలిపింది విదేశాంగ శాఖ.