తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2 కన్నుమూత.. అత్యధిక కాలం పాలించిన సామ్రాజ్ఞిగా ఘనత - Queen Elizabeth II dies

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. అంతకుముందు రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులంతా స్కాట్లాండ్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఎలిజబెత్‌-2 తన నాయకత్వంలో బ్రిటిష్‌ జాతికి స్ఫూర్తినందించారని భారత ప్రదాని మోదీ తన సంతాప సందేశంలో కొనియాడారు. ఆమె దృఢమైన నేతగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.

Queen Elizabeth II dies aged 96
Queen Elizabeth II dies aged 96

By

Published : Sep 9, 2022, 6:12 AM IST

Updated : Sep 9, 2022, 6:27 AM IST

Queen Elizabeth Died : బ్రిటన్‌ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్‌-2 (96) గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో కన్నుమూశారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. "ఈ మధ్యాహ్నం(గురువారం) బల్మోరల్‌లో రాణి ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు" అని బర్మింగ్‌హమ్‌ ప్యాలెస్‌ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయమే రాణి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్న నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులంతా స్కాటిష్‌ ఎస్టేట్‌ ఎబెర్డీన్‌షైర్‌కు చేరుకోవడం మొదలుపెట్టారు. ఆమె కుమారుడు, వారసుడైన ప్రిన్స్‌ ఛార్లెస్‌, ఆయన భార్య కామిల్లా, మనుమడు ప్రిన్స్‌ విలియమ్‌ బల్మోరల్‌ చేరుకున్నారు. వేసవి విడిది కోసం బల్మోరల్‌కు వచ్చిన ఎలిజబెత్‌-2 అక్కడే ఉంటున్నారు. ఇటీవల కాలంలో రాణి వృద్ధాప్య సమస్యలతో ఎక్కువగా కదల్లేకపోతున్నారు. దీంతో ఆమె ప్రయాణాలను కూడా బాగా తగ్గించుకున్నారు.

.

రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ నూతన రాజుగా, 14 కామన్వెల్త్‌ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. "రాజు, రాణి(ఛార్లెస్‌, కెమిల్లా) శుక్రవారం లండన్‌ చేరుకుంటారు" అని బర్మింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటనలో వివరించింది. రాణి మరణం దేశానికి, ప్రపంచానికి తీరనిలోటని ఛార్లెస్‌, ప్రధాని లిజ్‌ ట్రస్‌ అభివర్ణించారు. ఆమె మరణం పట్ల పలువురు దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

.

బరువెక్కిన హృదయంతో నివాళులర్పిస్తున్నా: మోదీ
బ్రిటన్‌ రాణి పోరాట యోధురాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. 2015-18లో బ్రిటన్‌ రాణితో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకున్న మోదీ.. తన పట్ల ఆమె చూపిన ప్రేమ,కరుణను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. తన వివాహ సమయంలో మహాత్మాగాంధీ బహుమతిగా ఇచ్చిన చేతి రుమాలును బ్రిటన్‌ రాణి చూపించారని ఆయన వెల్లడించారు. రాణి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.

మోదీ ట్వీట్​

ప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయింది: ద్రౌపదీ ముర్ము
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మరణం పట్ల ప్రపంచ దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ ప్రజలకు స్ఫూర్తిమంతమైన నాయకత్వాన్ని అందించారంటూ పలువురు నేతలు కొనియాడారు. ఎలిజబెత్‌-2 మరణంతో ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌ ప్రజలకు, రాణి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

.

రాజు ఛార్లెస్సే.. పట్టాభిషేకం ఇప్పుడే కాదు
బ్రిటన్‌ రాజుగా ఇకపై ప్రిన్స్‌ ఛార్లెస్‌ వ్యవహరించనున్నారు. పట్టాభిషేకానికి మాత్రం కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీనికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడం ఒక కారణం. రాజు లేదా రాణి కన్నుమూత తర్వాత 24 గంటల్లో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. దీని నిమిత్తం సీనియర్‌ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమవుతారు. ఆ తర్వాత పార్లమెంటును సమావేశపరుస్తారు. శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత ప్రకటిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరిస్తారు. అనువంశిక రాజరిక చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2

తరతరాలకూ సుపరిచితురాలు
యావత్‌ ప్రపంచానికి, తరతరాలకూ సుపరిచితురాలు... క్వీన్‌ ఎలిజబెత్‌-2. ఆమె పూర్తిపేరు ఎలిజబెత్‌ అలెగ్జాండ్రా మేరీ. డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌ అయిన ప్రిన్స్‌ ఆల్బర్ట్‌, ఆయన భార్య లేడీ ఎలిజబెత్‌ బోవెస్‌-లియాన్‌ల పెద్ద కుమార్తె. 1926, ఏప్రిల్‌ 21న లండన్‌లో జన్మించారు. తండ్రి మరణంతో.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్‌, నార్తర్న్‌ ఐర్లండ్‌లకు 1952, ఫిబ్రవరి 6న మహారాణిగా లాంఛనప్రాయ బాధ్యతలు చేపట్టారు. ఏడు దశాబ్దాలకుపైగా పాలించారు. 21 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్‌ దేశాల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.

విక్టోరియా రికార్డును బద్దలు కొట్టి..
క్వీన్‌ విక్టోరియా పాలన (63 సంవత్సరాల 7 నెలల 2 రోజులు) రికార్డును బద్దలు కొడుతూ.. బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన రాణిగా 2015లోనే ఎలిజబెత్‌-2 రికార్డు సృష్టించారు. గురువారం నాటికి 70 ఏళ్ల 7 నెలల 3 రోజులు పాలించారు. తన హయాంలో 4 వేలకుపైగా చట్టాలకు ఆమె ఆమోదముద్ర వేశారు.

బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2

భారత ఆతిథ్యానికి ముగ్ధురాలై..
మహారాణి హోదాలో వందకు పైగా దేశాల్లో ఎలిజబెత్‌-2 పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడాకు వెళ్లారు. భారత్‌లో మూడు పర్యాయాలు (1961, 1983, 1997) పర్యటించారు. ఇక్కడి ఆతిథ్యానికి ముగ్ధులయ్యారు. ఎలిజబెత్‌-2 నేతృత్వంలో మొత్తం 15మంది బ్రిటన్‌ ప్రధానులు సేవలు అందించారు. చైనాను సందర్శించిన, అమెరికాలో ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించిన తొలి బ్రిటిష్‌ మహారాణిగానూ చరిత్ర సృష్టించారు. భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌తో 73ఏళ్లపాటు కలిసి జీవించి మరో రికార్డు సృష్టించారు. గత ఏడాది ఏప్రిల్‌లో 99 ఏళ్ల వయసులో ఆయన మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు నలుగురు సంతానం.

ఇవీ చదవండి:పాక్​కు అమెరికా యుద్ధ విమానాలు.. బైడెన్ కీలక నిర్ణయం

భారతీయ విద్యార్థులకు జాక్​పాట్​.. రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు

Last Updated : Sep 9, 2022, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details