Biden Israel : ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు. గాజా ఆస్పత్రిలో పేలుడుకు ఇజ్రాయెల్ సైన్యం కారణం కాదని తెలుస్తోందని జో బైడెన్ తెలిపారు. టెల్‌అవీవ్ చేరుకున్న తర్వాత బైడెన్.. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. "నేను గమనించిన ప్రకారం.. ఇది మీ(ఇజ్రాయెల్) సైన్యం చేసిన దాడి కాదు.. ఇంకెవరో చేసినట్లు ఉంది" అని బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అన్నారు. కానీ పేలుడుకు కారణమేమిటో కచ్చితంగా తెలియదని తెలిపారు. ఘటనా సమయంలో అక్కడ చాలా మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
'హమాస్ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారు'
Biden Netanyahu : అంతకుముందు టెల్ అవీవ్‌కు చేరుకున్న బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఇసాక్ ఎర్జోగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు బైడెన్. హమాస్ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారని అన్నారు. ఇటువంటి సమయంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న పోరుకు అమెరికా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ అడుగుపెట్టినట్లు స్పష్టం చేశారు.
'యావత్ ప్రపంచానికి చెప్పడానికే వచ్చా'
Biden Israel Visit :"నేను ఇక్కడకు రావడానికి ఒకేఒక చిన్న కారణం. అమెరికా ఎవరివైపు ఉంటుందనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి చెప్పడానికే ఇక్కడకు వచ్చా. హమాస్ మిలిటెంట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. అవి ఐఎస్‌ఐఎస్ మాదిరిగానే ఉన్నాయి. పాలస్తీనియన్లందరికీ హమాస్ ప్రాతినిధ్యం వహించడం లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది వారికి బాధలనే మిగిల్చింది" అని బైడెన్ పేర్కొన్నారు.