తెలంగాణ

telangana

ETV Bharat / international

సూపర్​ 'బామ్మ'​.. 74 ఏళ్లపాటు 'లీవ్​' పెట్టకుండానే జాబ్​.. 90 ఏళ్లకు రిటైర్మెంట్! - 90 years old woman no leaves

90 Years Old Woman Job : ఏడు దశాబ్దాలపాటు డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో పనిచేసిన ఓ మహిళ.. ఇటీవలే పదవీ విరమణ చేశారు. 16 ఏళ్ల వయసులో ఆ డిపార్ట్​మెంట్‌ స్టోర్‌లో చేరిన ఆమె.. ఒక్క సెలవు కూడా తీసుకోకుండానే 74 ఏళ్లపాటు విధులకు హాజరయ్యారు. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె ఎక్కడ ఉద్యోగం చేశారో ఈ కథనంలో తెలుసుకుందాం.

90Year Old Woman Retires After 74 Years Without Missing A Single Day Of Work
90Year Old Woman Retires After 74 Years Without Missing A Single Day Of Work

By

Published : Jul 7, 2023, 3:33 PM IST

90 Years Old Woman Job : ఉద్యోగాలు చేసే వారు సాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు సెలవులు పెడుతూనే ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా లీవు పెట్టలేదు! తన 16వ ఏట ఉద్యోగంలో చేరిన ఓ బాలిక.. 74 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి.. 90 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 74 ఏళ్ల ఉద్యోగ సమయంలో ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా ఎలా పనిచేశారని.. అంతా నోరెళ్లబెడుతున్నారు.

లిఫ్ట్​ ఆపరేటర్​గా ఉద్యోగ జీవితాన్ని..
టెక్సాక్‌కు చెందిన మెల్బా మెబానే(90) అనే మహిళ.. టైలర్‌ అనే స్టోర్‌లో 1949లో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 1956లో ఆ సంస్థను డిలార్డ్‌ కొనుగోలు చేసింది. తొలుత లిఫ్ట్‌ ఆపరేటర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మెబానే.. అలా 74 ఏళ్లపాటు అదే సంస్థలో కొనసాగారు. ఆ షాపింగ్‌ మాల్‌లో దుస్తులు, కాస్మెటిక్‌ విభాగంలోనే సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. అయితే ఈ ఏడు దశాబ్దాల కాలంలో సెలవు లేకుండా విధులకు హాజరయ్యారు. గత నెలలో పదవీ విరమణ చేశారు.

మెల్బా మెబానే

తీవ్ర భావోద్వేగానికి లోనై..
74 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేసిన మెల్బా మెబానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇంట్లో కంటే ఆ స్టోర్‌లోనే ఎక్కువ కాలం ఉన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు.

"ఆ స్టోర్‌లో ఉన్నవారంటే నాకు ఎంతో ప్రేమ.. నిత్యం విధులకు హాజరు కావడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మాత్రం మంచి ఆహారం తీసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను"

-- మెల్బా మెబానే

'నిజంగా ఆమె అద్భుతం.. ఎంతో మందికి స్ఫూర్తి..'
"మెబానే పనిచేసిన కాలంలో ఎంత మందికి శిక్షణ ఇచ్చారో లెక్క వేయలేం. ఆమె కేవలం సేల్స్‌ మహిళే కాదు, ఓ మాతృమూర్తి, ఎంతోమందికి స్ఫూర్తి, కేవలం విధుల్లోనే కాకుండా జీవితంలోనూ ఎన్నో సూచనలు చేస్తుంటారు. పనిచేసిన అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. నిజంగా ఆమె అద్భుతం" అని డిలార్డ్‌ స్టోర్‌ మేనేజర్‌ మీడియాతో చెప్పారు. ఆమెను దాదాపు 65 ఏళ్లుగా చూస్తున్నానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details