మనం దేన్నైనా ఆపగలం కానీ సమయాన్ని, మనిషి జీవిత కాలాన్ని నిర్ణయించే వయసును మాత్రం ఆ భగవంతుడు కూడా ఆపలేడన్నది నగ్న సత్యం. అయితే అమెరికాలోని కాలిఫోర్నియా నివాసి అయిన 45 ఏళ్ల బ్రియాన్ జాన్సన్ వృద్ధాప్యఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఓ వైవిధ్యమైన ఆలోచన చేశాడు. 18 ఏళ్ల యువకుడిగా మారాలని ప్రత్యేకంగా వైద్య చికిత్స చేయించుకుంటున్నారు. దీని కోసం ఏకంగా ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు.
వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. వృద్ధాప్య ఛాయలూ కనిపిస్తాయి. ఇదంతా సహజంగా మానవ శరీరంలో జరిగే ప్రక్రియ. అయితే దీనికి విరుద్ధంగా వయసు మీద పడుతున్నా యువకుడిలా కనిపించాలనుకున్నారు బ్రియాన్ జాన్సన్. వయసును తగ్గించుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నాడో తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం..
శరీరంలో కొన్ని మార్పులు చేసినట్లయితే వయస్సు ఎక్కువగా కనిపించకుండా దీర్ఘాయువు పొందవచ్చని బ్రియాన్ జాన్సన్ ఓ పుస్తకంలో చదివారు. దీంతో 18 ఏళ్ల వయస్సులో తాను ఎలా ఉండేవాడో తిరిగి ఆ రూపం తెప్పించుకోవాలన్న కోరికతో అతడు వైద్యులను సంప్రదించారు. ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది. చికిత్స తర్వాత శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల మగవాడిలా కనిపిస్తున్నట్లు జాన్సన్ మీడియాకు వెల్లడించారు.
జాన్సన్ శరీరభాగాల పని తీరును తెలుసుకునేందుకు నిత్యం 30 మంది వైద్యులతో కూడిన బృందం అతడిని పర్యవేక్షిస్తోందట. దీని కోసం కాలిఫోర్నియాలోని జాన్సన్ ఇంట్లో భారీగా ఖర్చు చేసి ప్రత్యేక పరికరాలతో కూడిన ల్యాబ్‌ను కూడా సిద్ధం చేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ ఏడాది కూడా 2 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న జాన్సన్.. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు ఇలా ప్రతీ అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తూనే ఉంటానని చెబుతున్నారు. కాగా బ్రియాన్ జాన్సన్ ప్రస్తుతం బయోటెక్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.