కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో పాకిస్థాన్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ధాటికి 24 గంటల్లో 36 మంది మరణించారు. మరో 145 మంది గాయపడ్డారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ విషయం తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, వలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపింది.
దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో 18 మంది మరణించగా, 128 మంది గాయపడ్డారు. వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో ఏడుగురు చనిపోయారు. దేశంలో వరదలు వల్ల ఇప్పటివరకు 27,870 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 10,860 ఇళ్లుగా పూర్తిగా .. 17,010 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
--జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ