అందమైన బీచ్... అడుగున ఏముందో కనిపించేంత స్వచ్ఛమైన నీరు... అలల సవ్వడులు, పిల్ల గాలులు... మాల్దీవులు వంటి ప్రముఖ పర్యటక ప్రదేశాల్లో కనిపించే వాతావరణం ఇది. అంతటి అద్భుత వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఎంతో మంది లక్షలు ఖర్చు చేస్తుంటారు. నీలి రంగు సముద్ర తీరాన సరదాగా గడుపుతూ సెల్ఫీలు తీసుకుంటుంటారు.
రష్యా సైబీరియాలోని నోవోసిబిరిస్క్ నగరవాసులు ఇలాంటి వాతావరణంలో గడిపేందుకు పెద్ద కష్టపడాల్సిన పనిలేదు. ఖర్చూ లేదు. అలా అని... ఆ నగరం దగ్గర సముద్రమేమీ లేదు. ఉన్నదల్లా ఓ చిన్న సరస్సు. అది కూడా కృత్రిమమైందే.
సైబీరియన్ మాల్దీవులుగా పిలుస్తున్న ఈ సరస్సుకు నోవోబిరిస్క్ వాసులు క్యూ కడుతున్నారు. బికినీలు మొదలు పెళ్లి దుస్తుల వరకు... రకరకాల వేషధారణాల్లో ఫొటోలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.