మీ కుక్కపిల్ల గురించి ఒక్క మాటలో చెప్పాలా? అయితే "స్వార్థజీవి" అనండి. అది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే... కుక్కలు మంచివి కావు. తోడేళ్లే మంచివి. అవును ఇది నిజం.
'ప్లాస్ వన్' జర్నల్లో ప్రచురితమైన ఓ పరిశోధన వివరాల ప్రకారం... పెంపుడు కుక్క ఎంతో ఉదార స్వభావం కలిగి ఉంటుందనే నమ్మకం అంతా ఉత్తిదే.
గుంపులోని తోడేళ్లు కుక్కలకంటే తక్కువ స్వార్థం చూపిస్తాయని ఆస్ట్రియా వియన్నాలోని నక్కల శాస్త్రీయ కేంద్రం తాకేతెర వినియోగించి చేసిన కొన్ని ప్రయోగాల ద్వారా తెలిసింది.
పరిశోధన చేశారిలా....
కుక్కలు, తోడేళ్లలో పంచుకునే గుణం గురించి తెలుసుకునేందుకు పరిశోధకులు వేర్వేరుగా పరీక్షించారు. తాకే తెరపై ఇచ్చిన గుర్తుపై ముక్కును రాసే విధంగా శిక్షణనిచ్చారు. ఆ గుర్తుపై తాకితే మరోచోటున్న తోటి జంతువుకు ఆహారం అందుతుంది.
ఈ ప్రయోగంలో తోడేళ్లు తిరిగి ఎలాంటి ప్రతిఫలం లేదని తెలిసినా.. పలుమార్లు వాటి సమూహంలోని తోటి జంతువులకు ఆహారం అందించేందుకు మొగ్గుచూపాయి. కుక్కలు మాత్రం వాటికి ఎలాంటి లాభం చేకూరదని అనుకున్నప్పుడు... తోటి కుక్కలకు ఆహారం అందించేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అవి తెలిసిన కుక్కలైనా సరే.
"పెంపకం వల్ల కుక్కలు మరింత సహాయపడేలా తయారవుతాయనేది అపవాదు మాత్రమేనని ఈ పరిశోధనలో తేలింది. గుంపులోని తోటి జీవుల పట్ల సహనం, ఉదారత వీలైనంత ఎక్కువ ఉండటమే పరస్పర సహకారం అందించుకునేందుకు తోడ్పాటు అందిస్తుందని తేలింది. తోడేళ్లలో ఇది కనిపించిందని పరిశోధన చెబుతోంది."
-రాచెల్ డేల్, రచయిత
అవి భిన్నం...
మీ పెంపుడు కుక్క కూడా స్వార్థ జీవే అనడం తగదని అంటున్నారు నిపుణులు. పెంపుడు కుక్కలు స్నేహపూర్వక లక్షణాలు కలిగి ఉన్నాయని గత పరిశోధనల్లో తేలిన దృష్ట్యా.. వాటికి తాజా పరిశోధనను పూర్తిగా ఆపాదించరాదన్నది వారి మాట.