WHO Omicron: ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. అయితే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యే పరిస్థితి, మరణాలు తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిపుణులు డాక్టర్ అబ్దీ మహముద్ పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ ఇదే తరహాలో ఉంటుందని భావించలేమన్నారు. ఒమిక్రాన్ స్వభావం, తీవ్రత ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని చెప్పారు.
"దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఒమిక్రాన్ మరణాలు అత్యల్పంగా ఉన్నాయి. ఇదే తరహాలో ఇతర దేశాల్లో ఉండకపోవచ్చు" అని మహముద్ పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని చెప్పారు. అమెరికాలో కొవిడ్ కేసుల విపరీతంగా నమోదవుతున్నాయని గుర్తు చేశారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఇంతకముందు వేరియంట్లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్ శరీర పైభాగంపై ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని అధ్యయనాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
ఈ వేరియంట్ ఇప్పటివరకు 128 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఇదీ చూడండి:ఫ్రాన్స్‌లో కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్!