పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంపై ఐక్యరాజ్య సమితి సహా అనుబంధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. అయితే వాతావరణ కార్యాచరణ అమలు చేసేందుకు అమెరికాలోని సంస్థలు, భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశాయి.
పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగే ప్రక్రియ మూడేళ్ల తర్వాత పూర్తయింది. నవంబర్ 4న ఒప్పందం నుంచి అధికారికంగా బయటకు వచ్చేసింది అమెరికా.
అయితే ఈ చారిత్రక ఒప్పందానికి కట్టుబడి గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు పనిచేస్తామని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెంట్ ఛేంజ్(యూఎన్ఎఫ్సీసీసీ) స్పష్టం చేసింది. చిలీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే దేశాలతో సంయుక్తంగా ప్రకటన విడుదల చేసింది.
"మన గ్రహాన్ని, వాతావరణ మార్పుల నుంచి ప్రపంచంలోని ప్రజలను రక్షించడం కన్నా గొప్ప బాధ్యత ఇంకోటి లేదు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు అందరూ కలిగి చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరముంది. పచ్చదనం పెంచి, స్థిరమైన భవిష్యత్తు ఉండే విధంగా పనిచేయాల్సి ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి పారిస్ ఒప్పందం సరైన మార్గాన్ని చూపిస్తుంది."
-యూఎన్ఎఫ్సీసీసీ సహా సభ్య దేశాల సంయుక్త ప్రకటన
పటిష్ఠమైన పారిస్ ఒప్పందానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫానె డుజరిక్ పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం ఆవశ్యకతపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
డిసెంబర్ 12 నాటికి పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా పర్యావరణ ఆశయాలపై శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నట్లు డుజరిక్ తెలిపారు. దీనికి ఐరాస సహా ఆతిథ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.
అమెరికా నిర్ణయంపై యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇదివరకే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి, భద్రతను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తుందని అన్నారు.
బైడెన్ వస్తే మళ్లీ!
పారిస్ ఒప్పందంలో భాగంగా భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని అన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకునేందుకు అంగీకారానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన ముడేళ్ల తర్వాత ఇందులో నుంచి వైదొలిగే అవకాశాన్ని సభ్యదేశాలకు కల్పించారు. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన సంవత్సరం తర్వాత ఒప్పందం నుంచి నిష్క్రమించినట్లు పరిగణిస్తారు. కాగా.. 2016 సెప్టెంబర్ 3న పారిస్ ఒప్పందాన్ని అమెరికా అమలులోకి తెచ్చింది. 2017 ఆగస్టులో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ యంత్రాంగం ఐరాసకు అధికారిక నోటీసు ఇచ్చింది. అయితే తాము అధికారంలోకి వస్తే తిరిగి ఒప్పందంలోకి చేరుతామని జో బైడెన్ ఇదివరకే స్పష్టం చేశారు.
ఇదీ చదవండి-ట్రంప్ X బైడెన్: పారిస్ ఒప్పందంపై మాటల యుద్ధం