తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆక్స్​ఫర్డ్​ టీకా సురక్షితమో కాదో చెప్పండి' - ఆక్స్​ఫర్డ్​ టీకా న్యూస్​

ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా టీకా భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వైరుధ్యం తలెత్తడం వల్ల నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సమర్థతను తేల్చేందుకు మరోసారి ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈవో పాస్కల్‌ సోరియట్‌ తెలిపారు. మరోవైపు ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను వినియోగానికి అనుమతించాలో లేదో క్షుణ్నంగా సమీక్షించాలని మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీని బ్రిటన్ ప్రభుత్వం కోరింది.

UK asks regulator to assess AZ-Oxford vaccine amid questions
'ఆక్స్​ఫర్డ్​ టీకా సురక్షితమో కాదో చెప్పండి'

By

Published : Nov 27, 2020, 11:45 AM IST

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా సమర్థతపై సందేహాల తలెత్తుతున్న నేపథ్యంలో..... మరోసారి క్లినికల్‌ ప్రయోగాలు జరిపాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా సంస్థ సీఈవో పాస్కల్‌ సోరియట్‌ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న ప్రయోగాలకు ఇవి అదనం అని స్పష్టం చేశారు. తక్కువ డోసు తీసుకున్నవారిలో ఎక్కువ పనితీరు కనబర్చినందున ప్రయోగాలు ఆ కోణంలోనే సాగనున్నాయని తెలిపారు. ఈ సారి ప్రయోగాలు వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. సామర్థ్యం ఎక్కువగా ఉందని ముందే తెలిసిన నేపథ్యంలో తక్కువ మందిపై ప్రయోగిస్తే సరిపోతుందన్నారు. కొత్తగా జరపబోయే ప్రయోగాల వల్ల టీకా అత్యవసర వినియోగానికి అనుమతించేందుకు ఐరోపా సమాఖ్య(ఈయూ), యూకే జాప్యం చేస్తాయని తాను భావించడం లేదని సోరియట్‌ అభిప్రాయపడ్డారు. అమెరికాలో వ్యాక్సిన్ అనుమతికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాల్లో జరిపిన ప్రయోగాల సమాచారం ఆధారంగా అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులిచ్చేందుకు సుముఖంగా లేదని తెలిపారు. మరికొన్ని దేశాల్లో డిసెంబరు చివరి నాటికి అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు.

ఫలితాల్లో వైరుధ్యం..

రెండు రకాల డోసుల్లో టీకాను పరీక్షించామని ఆస్ట్రాజెనెకా ప్రాథమిక ఫలితాల ప్రకటనలో వెల్లడించింది. ఒక విధానంలో ప్రామాణిక డోసులో సగం మేర ఇచ్చామని.. నెల తర్వాత రెండో డోసును పూర్తిస్థాయిలో ఇచ్చామని తెలిపింది. వీరిలో 90శాతం రక్షణ లభించిందని వెల్లడించింది. అయితే, సగం ఇవ్వాలన్నది తమ ప్రయోగాల్లో భాగం కాదని, పొరపాటున అలా జరిగిందని తెలిపింది. దీంతో శాస్త్రవేత్తలు, పరిశోధకుల నుంచి సందేహాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు రెండో విధానంలో నెల వ్యవధిలో రెండు పూర్తిస్థాయి డోసులు ఇవ్వగా 62 శాతం రక్షణ లభించినట్లు తెలిపింది. ఈ వైరుధ్యానికి కారణాలు తమకు తెలియదని చెప్పింది. దీంతో భిన్న డోసుల మధ్య వైరుధ్యం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

బ్రిటన్​ ప్రభుత్వ స్పందన..

టీకా సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతుండటంపై బ్రిటన్​‌ ప్రభుత్వం సైతం స్పందించింది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను వినియోగానికి అనుమతించాలో లేదో క్షుణ్నంగా సమీక్షించాలని మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్​ఆర్ఏ)ని ఆ దేశ ఆరోగ్య కార్యదర్శి కోరారు. దీనిపై స్పందించిన ఎంహెచ్​ఆర్​ఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌... పూర్తి స్థాయి సమీక్ష తర్వాతే అనుమతికి ప్రతిపాదిస్తామని తెలిపారు. దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే 100 మిలియన్‌ ఆక్స్‌ఫర్డ్‌ డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. డిసెంబరులో పంపిణీకి ప్రణాళికలు కూడా పూర్తి చేసింది.

సురక్షితమే..

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా టీకా సురక్షితం, ప్రభావవంతమైనదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. భారత్‌లో.. అన్ని నిబంధనలను అనుసరిస్తూ టీకా ట్రయల్స్‌ సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. ఈ సమయంలో గందరగోళానికి లోనుకాకుండా.. సహనంతో ఉండాలని కోరింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న టీకాను భారత్‌లో పంపిణీ చేసేందుకు సీరం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి: నేపాల్​కు కొవిడ్​ యాంటీ-వైరల్​ డ్రగ్స్​ అందించిన భారత్​

ABOUT THE AUTHOR

...view details