అడ్డుఅదుపు లేకుండా ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా వైరస్ ఐరోపాలో కాస్త నెమ్మదించింది. ఐరోపాలోని ప్రధాన దేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా మరణాల సంఖ్య తగ్గింది.
ఫ్రాన్స్‌లో ఆదివారం 357మంది వైరస్ ధాటికి మృతి చెందారు. ఈ వారంలో నిన్నే తక్కువ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 28,891 మంది కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 6,978 మంది ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్నట్లు తెలిపారు.
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 17న ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 70,478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అక్కడా ఇంతే...
ఇటలీలో గత రెండు వారాల్లో రెండోసారి తక్కువ మరణాలు సంభవించాయి. ఆదివారం 525 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. గతంలో మార్చి 19న అత్యల్పంగా 427 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు దేశంలో మృతుల సంఖ్య 15, 887కు చేరింది.