కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుంటే... ఐరోపాలో మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. స్పెయిన్‌లో మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో తాజాగా 2వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 7వేల 753మంది వైరస్ బారిన పడ్డారు. 24 గంటల వ్యవధిలో 100 మందికిపైగా మరణించారు. దీనితో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ గణాంకాలే స్పెయిన్‌లోని పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. యూరప్‌లో ఇటలీ తర్వాత అత్యధింగా ప్రభావితమైన దేశంగా స్పెయిన్ ఉంది.
ఫ్రాన్స్‌లో ఎన్నికల నిర్వహణ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు విధించినప్పటికీ.. దేశవ్యాప్తంగా మేయర్, స్థానిక ఎన్నికలను నిర్వహించింది ఫ్రాన్స్. కొత్త ఆదేశాలతో పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నడూ లేని విధంగా పారిశుద్ధ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. క్యూలైన్లలో ఒక్కొక్కరి మధ్య ఒక మీటర్ దూరం ఉండేలా చూడటంతో పాటు సబ్బులు, శానిటైజర్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంచారు అధికారులు. ఓటింగ్ రిజిస్టర్లో సంతకం చేసేందుకు ప్రతి ఒక్కరు పెన్నులు తెచ్చుకున్నారు.
ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 4,500 మంది కోవిడ్-19 బారిన పడ్డారు. 91 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్టారెంట్లు, మ్యూజియంలు, వ్యాపార సముదాయాలను ఇప్పటికే మూసివేసిన ప్రభుత్వం.. తాజాగా సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు, విమానాలను రద్దు చేసింది.