తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ 'నిరుద్యోగి' క్రియేటివిటీకి ఫిదా.. పిలిచి మరీ ఉద్యోగం!

resume on pamphlet: యూకేకు చెందిన ఓ నిరుద్యోగి యార్క్‌షైర్‌లో ఉన్న ఇన్‌స్టాంట్‌ప్రింట్‌ అనే కంపెనీ ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరిలా తాను రెజ్యుమ్‌ పంపిస్తే యాజమాన్యం దృష్టిలో పడనేమోనని భావించి.. కొత్త పంథాను ఎంచుకున్నాడు. తను ఉద్యోగంలో చేరాలనుకునే కంపెనీకి చెందిన కరపత్రాలను కొన్ని సేకరించి.. వాటిపై తన వివరాలను ముద్రించి పంపాడు. ఆ నిరుద్యోగి ప్రతిభకు ఫిదా అయిన కంపెనీ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది.

By

Published : Feb 1, 2022, 9:31 AM IST

resume on pamphlet
కంపెనీ కరపత్రంపై రెజ్యుమ్‌

resume on pamphlet: ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు రెజ్యుమ్‌ జత చేస్తుంటారు. అయితే, అది సాదాసీదాగా ఉంటే సంస్థ యాజమాన్యం పట్టించుకోదేమోనని.. కొంతమంది తమ సృజనకు పని చెబుతారు. క్రియేటివ్‌గా రెజ్యుమ్‌ రూపొందించి మెయిల్‌ చేయడమో.. నేరుగా ఇవ్వడమో చేస్తుంటారు. కానీ, యూకేకు చెందిన ఓ నిరుద్యోగి మరి కాస్త భిన్నంగా ఆలోచించి కంపెనీనే అవాక్కయ్యేలా రెజ్యుమ్‌ రూపొందించాడు. ఆ కంపెనీ.. అతడి తెలివి తేటలకు మెచ్చుకొని 'నీలాంటోడే మాకు కావాలి' అంటూ వెంటనే అతడికి ఉద్యోగం ఇచ్చేసింది.

యూకేకు చెందిన జోనథాన్‌ స్విఫ్ట్‌ ఓ నిరుద్యోగి. యార్క్‌షైర్‌లో ఉన్న ఇన్‌స్టాంట్‌ప్రింట్‌ అనే కంపెనీ ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అందరిలా తాను రెజ్యుమ్‌ పంపిస్తే యాజమాన్యం దృష్టిలో పడనేమోనని భావించిన స్విఫ్ట్‌.. కొత్త పంథాను ఎంచుకున్నాడు. తను ఉద్యోగంలో చేరాలనుకునే కంపెనీకి చెందిన కరపత్రాలను కొన్ని సేకరించి.. వాటిపై తన వివరాలను ముద్రించాడు. వాటిని తీసుకెళ్లి నేరుగా ఆ కంపెనీ భవనం పార్కింగ్‌ స్థలంలో నిలిచి ఉన్న కార్లకు అంటించడం మొదలుపెట్టాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో స్విఫ్ట్‌ చేస్తున్న తంతుని ఆ కంపెనీ మార్కెటింగ్‌ మేనేజర్‌ క్రెయిగ్‌ వాస్సెల్‌ గమనించి ఆరా తీయగా.. స్విఫ్ట్‌ క్రియేటివిటీ గురించి తెలిసింది. వెంటనే అతడిని ఇంటర్వ్యూకి పిలిపించి.. ఉద్యోగానికి ఎంపిక చేశారు. 'మేం ఉద్యోగ ప్రకటన ఇచ్చింది.. కూడా ఇలాంటి సృజనాత్మక ఆలోచన ఉన్న వారి కోసమే. అందుకే, ఇంకేం ఆలోచించకుండా అతడికి ఉద్యోగం ఇచ్చాం. ఇలాంటి క్రియేటివ్‌ దరఖాస్తులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది' అని క్రెయిగ్‌ చెప్పుకొచ్చారు. స్విఫ్ట్‌ కార్లకు తన రెజ్యుమ్‌ను అంటిస్తున్నప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని సంస్థ సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ కంపెనీలో అతడికి ఉద్యోగంతోపాటు పాపులారిటీ కూడా లభించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details