Psycho squirrel: అది 2021 మార్చి.. బ్రిటన్ ఫ్లింట్షైర్లోని బక్లీ పట్టణం.. కొరిన్ రెనాల్డ్స్ అనే మహిళ పెరట్లోని తన పెంపుడు పక్షులకు మేత వేస్తోంది. అప్పుడే ఆమెకు ఓ ఉడత కనిపించింది. పక్షుల మేతను 'దొంగిలించి' కడుపు నింపుకునేందుకు వచ్చిందది. పోనీలే పాపమని.. ఆ ఉడతకూ రోజూ మేత వేయడం మొదలుపెట్టింది కొరిన్. అలా వారి మధ్య స్నేహం కుదిరింది. ఆ ఉడత ఏ మాత్రం భయపడకుండా కొరిన్ చేతిపై ఎక్కి, ఆహారం తీసుకునేంతగా చనువు పెరిగింది.
కానీ.. గత వారం, క్రిస్మస్కు కొద్దిరోజుల ముందు అనూహ్య ఘటన జరిగింది. ఆహారం అందిస్తున్న కొరిన్ చేతిని కరిచి పారిపోయింది ఆ ఉడత. ఇలా ఎందుకు అయిందా అని అనుకుంటున్న ఆమెకు.. కొన్ని ఫేస్బుక్ పోస్టులు చూడగానే భయమేసింది.
ఆ పోస్టుల్లో ఏముంది?
కొరిన్ కంటపడ్డ ఫేస్బుక్ పోస్టులన్నీ ఆ ఉడత గురించే. అందరిదీ ఒకటే ఫిర్యాదు.. ఉడత కరిచిందని. "హెచ్చరిక. మనుషులపై దాడి చేసే దుష్ట ఉడతతో జాగ్రత్తగా ఉండండి. ఆ ఉడత నన్ను, నా ఫ్రెండ్ను, మరెంతో మందిని కరిచింది. మా పిల్లులపైనా దాడి చేసింది. ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లకండి" అని ఈనెల 26న బక్లీ వాసుల ఫేస్బుక్ గ్రూప్లో పోస్ట్ చేసింది నికోలా క్రౌథర్ అనే మహిళ.
షెరీ డేవిడ్సన్దీ అదే కథ. పదునైన పళ్లతో తన చేతిపై గట్టిగా కరిచిందని చెప్పింది షెరీ. ఇలా ఒకరిద్దరు కాదు.. రెండు రోజుల్లో 18 మందిని.. తల నుంచి పాదాల వరకు ఎక్కడపడితే అక్కడ కరిచింది ఆ ఉడత. పిల్లలు, పెద్దలు అందరూ బాధితులే. సుమారు 16వేల మంది జనాభా ఉండే బక్లీలో క్రిస్మస్ వేళ ఇదే హాట్ టాపిక్. అంతా కలిసి ఆ ఉడతకు స్ట్రైఫ్ అని నామకరణం కూడా చేశారు. గ్రెమ్లిన్స్ సినిమాలో విలన్ పేరది.
ప్రేమను నటించి, పట్టేసిన కొరిన్..