ఇటలీ రాజధాని రోమ్ వేదికగా జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో అగ్రదేశాల అధినేతలను కలిశారు ప్రధాని నరేంద్రమోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సరదాగా సంభాషించారు. ఇరుదేశాధినేతలు భుజాలపై చేతులు వేసుకుని నడుస్తూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వీరి ఆసక్తికర సంభాషణ తొలిరోజు సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు మోదీ. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వీరే గాక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్‌తోనూ మోదీ మాట్లాడారు.
ప్రపంచంలోని ఆర్థిక దిగ్గజ దేశాధినేతలు కొవిడ్ తర్వాత తొలిసారి జీ-20 సదస్సులో భాగంగా ఇటలీలో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, కొవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రపంచస్థాయిలో కనీస కార్పొరేట్ ట్యాక్స్ వంటి అజెండా అంశాలపై చర్చించనున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ.. సదస్సు వేదిక వద్ద జీ-20 దేశాధినేతలకు స్వాగతం పలికారు. సదస్సు ప్రారంభ సెషన్లో ప్రపంచ ఆరోగ్యం, ఆర్థికవ్యవస్థపై జీ-20 దేశాధినేతలు దృష్టి సారించారు. ఈ సందర్భంగా కీలక దేశాధినేతలు ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్యలకు సంబంధించి కూడా చర్చించనున్నారు. జీ-20 సదస్సు భేటీ తర్వాత చాలామంది దేశాధినేతలు ఐరాస నిర్వహించే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు స్కాట్లాండ్లోని గ్లాస్గోకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు.
ఇదీ చదవండి:'ప్రవాస భారతీయులతో సంభాషణ గొప్పగా జరిగింది'