తెలంగాణ

telangana

ETV Bharat / international

నీటిపై తేలియాడే పశువుల పాక చూశారా? - welfare

నీటిపై తేలియాడే పొలాలు... బంగ్లాదేశ్​ వంటి కొన్ని దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. నెదర్లాండ్స్​కు చెందిన ఓ ఇంజినీర్​ మాత్రం ఈ ట్రెండ్​ను కాస్త మార్చారు. నీటిపై తేలే పశువుల పాకను సృష్టించారు. వాతావరణ మార్పుతో పొంచి ఉన్న సవాళ్లకు సాంకేతికత సాయంతో సమాధానమిచ్చారు.

నీటిపై తేలియాడే పశువుల పాక చూశారా?

By

Published : Jul 2, 2019, 7:23 AM IST

నీటిపై తేలియాడే పశువుల పాక చూశారా?
వాతావరణ మార్పు... ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెను సవాలు. ఉష్ణోగ్రతలతోపాటు పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు... మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీ విస్తీర్ణంలో వ్యవసాయ భూమి నీట మునిగిపోతుందన్న అనుమానాలకు తావిస్తున్నాయి. అదే జరిగితే... ఆహార భద్రతకే ముప్పు.

వాతావరణ మార్పుతో ఎదురయ్యే సవాళ్లకు ఓ పరిష్కారం కనుగొన్నారు నెదర్లాండ్స్​కు చెందిన ఇంజినీర్ పీటర్​ వాన్ వింగర్డెన్. రైతు అవతారం ఎత్తి నీటిపై తేలియాడే పశువుల పాకను సృష్టించారు. నగరాల్లో వ్యవసాయం చేసే అవకాశమే లేదనుకునేవారికి సమాధానమిచ్చారు.

ఆహారాన్ని రవాణా చేయడం కాలుష్యానికి కారణం అవుతోంది. ఆహార నాణ్యత కూడా దెబ్బతింటోంది. అందుకే మనం కొత్త నమూనా కనుగొనాలి. అది కూడా ప్రజలకు అనువుగా ఉండాలి. అందుకోసం ఏం చేయవచ్చో మేము ఇక్కడ చేసి చూపిస్తున్నాం. కానీ... ప్రస్తుతమున్న సాగు విధానాన్ని మార్చాల్సిన అవసరంపై ప్రజల్ని ఒప్పించడమే ఇక్కడ పెద్ద సవాలు.

- పీటర్​ వాన్​ వింగర్డెన్, ఫ్లోటింగ్​ ఫామ్​ వ్యవస్థాపకుడు

రోటర్​డ్యామ్​లోని ఓ పోర్టులో ఉంటుంది మూడు అంతస్తుల ఫ్లోటింగ్​ ఫామ్​. అంతా సాంకేతికతమయం. ఆవు పాలు తీసేది రోబోలే. పేడ ఎత్తేదీ మరయంత్రాలే.

నీటి ఉపరితలాన్ని సాధ్యమైనంత సద్వినియోగం చేసుకుంటున్నాం. తొలి అంతస్తులో పాలను ప్రాసెసింగ్ చేసే విభాగం ఉంటుంది. పేడను ఎరువుగా మార్చి, నగరానికి సరఫరా చేస్తాం. రెండో అంతస్తులో ఆవులు ఉంటాయి. 40 ఆవులు ఉంచొచ్చు. పాలు తీసేందుకు, గడ్డి వేసేందుకు పూర్తిగా రోబోలనే వాడతాం.

-పీటర్​ వాన్​ వింగర్డెన్, ఫ్లోటింగ్​ ఫామ్​ వ్యవస్థాపకుడు

ఫ్లోటింగ్​ ఫామ్​లో పశువులకు వేసే మేత కూడా ప్రత్యేకమైందే. దగ్గర్లో ఉండే గోల్ఫ్​ కోర్స్​, ఫుట్​బాల్​ మైదానంలో కత్తిరించిన గడ్డి, స్థానిక బీరు తయారీదారు ఉపయోగించిన ధాన్యం, బంగాళాదుంపల తుక్కును ఆవులకు వేస్తారు. ప్రస్తుతం ఇక్కడున్న ఒక్కో ఆవు రోజుకు 20 లీటర్ల పాలు ఇస్తోంది. ఫ్లోటింగ్​ ఫామ్​లో పశువుల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు పీటర్​.

ఇక్కడ ఉక్కుకు బదులు రబ్బరు ఫ్లోరింగ్​ వేశాం. తక్కువ స్థలంలో ఎక్కువ ఆవులు ఉండేలా చూసుకున్నాం. ఆవులకు దెబ్బలు తగలకుండా ఇనుప స్తంభాలకు బదులు రబ్బరు స్తంభాలు ఏర్పాటుచేశాం. జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.

పీటర్​ వాన్​ వింగర్డెన్, ఫ్లోటింగ్​ ఫామ్​ వ్యవస్థాపకుడు

పశువులశాల పైకప్పును వాన నీటిని ఒడిసిపట్టేలా రూపొందించారు. పక్కనే నీటిపై సౌర ఫలకాలు తేలియాడుతూ ఉంటాయి. ఫ్లోటింగ్​ ఫామ్​ నిర్వహణకు అవసరమైన విద్యుత్​లో 40శాతం వీటి నుంచే ఉత్పత్తి అవుతుంది.

ఫ్లోటింగ్​ ఫామ్​ ఏర్పాటుకు అయిన ఖర్చు 3 కోట్ల 40 లక్షల డాలర్లు. ఇలాంటివి సింగపూర్​, చైనా, అమెరికాలోనూ ఏర్పాటు చేయడంపై అక్కడివారితో చర్చలు జరుపుతున్నారు పీటర్.

ఇదీ చూడండి:

'స్వేచ్ఛ' కోసం హాంగ్​కాంగ్ వాసుల పోరుబాట

ABOUT THE AUTHOR

...view details