తెలంగాణ

telangana

ETV Bharat / international

అక్టోబర్​లోనే 'ఒమిక్రాన్​' వ్యాప్తి- ఆ దేశాల్లో తొలి కేసు - కరోనా వైరస్​

omicron variant cases: ఒమిక్రాన్​.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్​పై సమాచారం ఇచ్చే వరకు ఎవరికీ తెలియదు. కానీ, ఈ వైరస్​ వ్యాప్తి అక్టోబర్​లోనే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. నైజీరియాలో అక్టోబర్​లో సేకరించిన నమూనాల్లో కొత్త వేరియంట్​ బయటపడింది.

omicron variant
ఒమిక్రాన్​ కేసులు

By

Published : Dec 1, 2021, 5:41 PM IST

Updated : Dec 1, 2021, 6:20 PM IST

omicron variant cases: కరోనా కొత్త వేరియంట్​పై దక్షిణాఫ్రికా నవంబర్​ 24న ప్రపంచానికి సమాచారం అందించింది. అయితే, గత అక్టోబర్​లోనే ఈ వైరస్​ వ్యాప్తి మొదలైనట్లు తాజాగా వెల్లడైంది. దక్షిణాప్రికా కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్​'ను గుర్తించేందుకు కొన్ని వారాల ముందు సేకరించిన నమూనాలో కొత్త వైరస్​ నిర్ధరణ అయినట్లు నైజీరియా తాజాగా ప్రకటించింది.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారి నమూనాలు సేకరించి పరీక్షించగా కొత్త వేరియంట్​ నిర్ధరణ అయినట్లు ఆ దేశ జాతీయ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తంగా ఇద్దరికి ఈ వైరస్ నిర్ధరణ అయిందని తెలిపింది. దీంతో.. ఒమిక్రాన్​ కేసులు వచ్చిన తొలి పశ్చిమ ఆఫ్రికా దేశంగా నైజీరియా నిలించింది.

నెదర్లాండ్స్​లోనూ..

కొత్త వేరియంట్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలోకి ఒమిక్రాన్​ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్​ వెల్లడించింది. నవంబర్​ 24న కొత్త వేరియంట్​ గురించి డబ్ల్యూహెచ్​ఓకు దక్షిణాఫ్రికా చెప్పిందని.. అయితే తమ దేశంలో 19 నుంచి 23 మధ్య తీసిన నమూనాల్లో ఒమిక్రాన్​ను గుర్తించినట్టు నెథర్లాండ్స్​ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

సౌదీలో తొలి కేసు..

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ తొలి కేసును గుర్తించినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో వైరస్​ నిర్ధరణ అయినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. వైరస్​ సోకిన వ్యక్తితో పాటు ఆయన సన్నిహితులను క్వారంటైన్​కు తరలించినట్లు పేర్కొంది. దీంతో గల్ఫ్​ దేశాల్లో తొలి ఒమిక్రాన్​ కేసు నమోదైనట్లయింది.

ఇప్పటి వరకు సుమారు 20 దేశాల్లో ఒమిక్రాన్​ వేరియంట్​ వెలుగు చూసింది. క్రమంగా ఒక్కోదేశానికి వైరస్​ వ్యాప్తి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ ఆంక్షలు మొదలయ్యాయి.

జపాన్​లో బూస్టర్​ డోస్​ల పంపిణీ

కొత్త వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆరోగ్య సిబ్బందికి బూస్టర్​ డోస్​ల పంపిణీ ప్రారంభించింది జపాన్​. 9నెలల క్రితం వ్యాక్సిన్​ తీసుకున్నవారు బూస్టర్​ తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. టోక్యో మెడికల్​ సెంటర్​లో కొందరు నర్సులు, డాక్టర్లకు బూస్టర్​ డోస్​లు పంపిణీ చేశారు.

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు

కొత్త వేరియంట్​ ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్​ చివరి వరకు జపాన్​కు చేరుకునే విమానాల్లో కొత్త రిజర్వేషన్లు తీసుకోవద్దని అంతర్జాతీయ ఎయిర్స్​లైన్స్​ను ఆదేశించింది ఆ దేశ ప్రభుత్వం. అత్యవసర చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఇప్పటికే రిజర్వేషన్​ చేసుకున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ వేరియంట్​ రెండు కేసులు వెలుగు చూశాయి.

ఆస్ట్రేలియాలో లాక్​డౌన్​ పొడిగింపు..

దేశంలో కరోనా కేసుల పెరుగుదల, కొత్త వేరియంట్​ భయాల నేపథ్యంలో డిసెంబర్​ 11వరకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగించింది ఆస్ట్రేలియా. నవంబర్​ 22న ప్రారంభమైన జాతీయ లాక్​డౌన్​ను పొడిగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది పార్లమెంటరీ కమిటీ. రాత్రి 9గంటల వరకు అనుమతిస్తున్న అత్యవసర వస్తువుల దుకాణాలను సైతం సాయంత్రం 7 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. క్రిస్మస్​ ట్రీ అమ్మకాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారు.

అత్యవసర భేటీకి ఈయూ నో..

ఒమిక్రాన్​ వేరియంట్​ వెలుగు చూసిన క్రమంలో అత్యవసరంగా బ్లాక్​ లీడర్స్​ స్థాయి సమావేశం నిర్వహించాలన్న నిర్ణయానికి యురోపియన్​ యూనియన్​ నిరాకరించింది. డిసెంబర్​ 16న నేతల సాధారణ సమావేశానికి ముందు 27 దేశాల ఆరోగ్య మంత్రులు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తారని ఈయూ అధికారి తెలిపారు. అత్యవసర సమావేశం ఎప్పుడనే అనిశ్చితి నెలకొన్న క్రమంలో ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీపై రోజుల తరబడి చర్చ జరుగుతున్నా.. 27 దేశాల నాయకులు హాజరయ్యేందుకు ఒక తేదీని నిర్ణయించలేకపోయారు. కొత్త వేరియంట్​పై సరైన సమాచారం అందుబాటులో లేనందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశంపైనా గందరగోళం నెలకొంది.

ఐరోపాలోని 11దేశాల్లో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూశాయి. అందులో చాలా మంది ఆఫ్రికాకు వెళ్లివచ్చినవారే ఉన్నట్లు తేలింది. ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో రోజువారీ పరిస్థితులను ఐరోపా దేశాలు, యూరోపియన్​ కౌన్సిల్​ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి.

ఇదీ చూడండి:Covid Endemic Phase: ఒమిక్రాన్​ ఎంట్రీతో.. ముగిసిన మహమ్మారి దశ!

Last Updated : Dec 1, 2021, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details