తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​ వాయిదా... అక్టోబర్​ 31వరకు గడువు - ఐరోపా సమాఖ్య

ఒప్పంద రహిత బ్రెగ్జిట్​ పర్యవసానాల నుంచి తప్పించుకునేందుకు ఈయూ, బ్రిటన్​ ముందడుగు వేశాయి. బ్రెగ్జిట్​ కోసం బ్రిటన్​కు మరో ఆరు నెలల గడువు పొడిగించేందుకు ఐరోపా సమాఖ్య అంగీకరించింది. ఒప్పందానికి ఆమోదం తెలిపేలా బ్రిటన్​ పార్లమెంటు సభ్యుల్ని ఒప్పించడం ఇప్పుడు ప్రధాని థెరిసా మే ముందున్న ప్రధాన సవాలు.

బ్రెగ్జిట్​పై ఈయూ దేశాల నేతల సదస్సు

By

Published : Apr 11, 2019, 2:53 PM IST

Updated : Apr 11, 2019, 3:01 PM IST

బ్రెగ్జిట్​ గడువు పొడిగింపునకు ఐరోపా సమాఖ్య దేశాలు అంగీకరించాయి. ఫలితంగా... ఈయూ నుంచి విడిపోయేందుకు బ్రిటన్​కు అక్టోబర్​ 31 వరకు సమయం లభించింది. బ్రిటన్​ ప్రధాని థెరిసా మేతో పాటు 27 ఈయూ దేశాల నేతలు దాదాపు ఆరు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు.

శుక్రవారమే వైదొలగాల్సింది

ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగేందుకు శుక్రవారమే తుది గడువు. బ్రెగ్జిట్​ బిల్లు బ్రిటన్​ పార్లమెంటులో ఇప్పటికే మూడు సార్లు తిరస్కారానికి గురైంది. ఫలితంగా... ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్​ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమావేశానికి థెరిసా మే పట్టుబట్టారు. జూన్​ 30 వరకు గడువు పొడిగించాలని ఈయూని కోరారు.

ఒప్పందం లేకుంటే తీవ్ర నష్టమే

ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగితే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆర్థిక వేత్తలు, వ్యాపార వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సహా భారతీయ మార్కెట్లపైనా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పర్యటక రంగం చిక్కుల్లో పడుతుంది. సుంకాలు, తనిఖీల వల్ల బ్రిటిష్​ పోర్టుల్లో కార్యాకలాపాలు నిలిచిపోతాయి. సరుకుల కొరత ఏర్పడుతుంది. బ్రిటన్​, ఈయూ దేశాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. అందుకే.. గడువు పొడగింపునకు ఈయూ దేశాలు మొగ్గుచూపాయి.

అడిగింది జూన్​ 30, ఇచ్చింది అక్టోబర్​ 31

బ్రెగ్జిట్​ అమలుకు గడువును జూన్​ 30 వరకు పెంచితే చాలని ఈయూను బ్రిటన్​ ప్రధాని థెరిసా మే కోరారు. అప్పటిలోగా పార్లమెంటు ఒప్పందానికి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకుంటామనే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈయూ నేతలు అక్టోబర్​ 31వరకు గడువు పొడిగింపునకు ఈయూ దేశాధినేతలు నిర్ణయించారు.
గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మార్చి 29నే ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలగాల్సింది.

థెరిసా ఏమనుకుంటున్నారు?

జూన్​ 30 తర్వాత ఈయూతో కలిసి ఉండేందుకు థెరిసా మే సుముఖంగా లేరు. ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించారు. ఒక్కసారి బ్రెగ్జిట్​కు పార్లమెంటు ఆమోదం లభిస్తే తక్షణమే ఈయూ నుంచి వైదొలుగుతామని చెప్పారు.

ప్రతిపక్ష నేతతోనూ చర్చలు

బ్రిటన్​ ఎంపీలు పార్లమెంటులో బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని మూడుసార్లు తిరస్కరించారు. కొత్త ప్రతిపాదనలతో మరోమారు పార్లమెంటుకు ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు మే. ఇందుకు సహకరించాలని కోరుతూ ప్రతిపక్ష లేబర్​ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

Last Updated : Apr 11, 2019, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details