ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం.. ఐరోపా దేశాల్లో క్రమంగా క్షీణిస్తోంది. కట్టుదిట్టమైన చర్యలు, ముందస్తు జాగ్రత్తల కారణంగా.. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. స్పెయిన్‌లో ఆదివారం 410 మంది మరణించారు. ఫ్రాన్స్, ఇటలీల్లోనూ వరుసగా 395, 433 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా చూస్తే ఇవి ఆయా దేశాల్లో కనిష్ఠ మరణాలు కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా 24 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షా 65 వేల మందికిపైగా ప్రాణాలు విడిచారు. 6 లక్షల 24 వేలకుపైగా కోలుకున్నారు.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం... అమెరికాలో 24 గంటల వ్యవధిలో 1997 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల కేసులు నమోదయ్యాయి.
ఐరోపాలో 10 లక్షలు దాటిన కేసులు...
కొవిడ్ వైరస్ ఐరోపాను అతలాకుతలం చేసింది. ఇక్కడ కేసులు 10 లక్షలను మించాయి. మరో లక్ష మందికిపైగా బలయ్యారు. స్పెయిన్‌లోనే అత్యధికంగా లక్షా 98 వేలకుపైగా వైరస్ బారినపడ్డారు. ఇటలీలో లక్షా 78 వేలు, ఫ్రాన్స్‌లో లక్షా 52 వేలకుపైగా బాధితులున్నారు.
ఇటలీలో తగ్గుముఖం....
ఐరోపాలో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇటలీలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం అక్కడ కేవలం 433 మందే ప్రాణాలు కోల్పోయారు. ఈ వారంలోనే ఇది కనిష్ఠం. ఇప్పటివరకు దేశంలో 23 వేల 660 మందిని కరోనా బలితీసుకుంది. మరో 3047 మందికి వైరస్ సోకింది.
అక్కడ కనిష్ఠం..
ఫ్రాన్స్ కనిష్ఠ మరణాలను ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 395 మంది మరణించారు. ఇందులో 227 మంది ఆసుపత్రుల్లో, 168 మంది నర్సింగ్ హోంలలో చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 19 వేల 718 ఉన్నట్లు స్పష్టం చేశారు.
బ్రిటన్‌లో ఆదివారం 596 మంది కొవిడ్ కారణంగా మరణించారు. ఇక్కడ మొత్తం మరణాల సంఖ్య 16 వేల 60కి చేరింది. కొత్తగా 5 వేల 850 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 20వేలపైనే ఉంది. ఇక్కడి వృద్ధుల సంరక్షణాలయాల్లో మాత్రం కొవిడ్ మృతుల సంఖ్య వారం వ్యవధిలోనే రెట్టింపై 2500కు చేరింది.
కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్రమేపీ అధికార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
మరో 410 మంది..
స్పెయిన్‌లో మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆ దేశంలో ఇవాళ 410 మంది మరణించారు. మొత్తంగా స్పెయిన్‌లో 20,453మంది కరోనాకు బలయ్యారు.
బెల్జియం, నెదర్లాండ్స్‌లో ఆదివారం 230, 83 చొప్పున మరణించారు.
ఇరాన్లో గడిచిన 24 గంటల్లో 87 కరోనా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,118 మంది కొవిడ్ ధాటికి బలయ్యారు. ఇక్కడ వరుసగా ఆరోరోజూ 100లోపే మరణాలు నమోదైనా.. శనివారంతో పోలిస్తే 14 మంది అధికంగా మరణించారు.
టర్కీలో 2 వేలు ప్లస్...
టర్కీలో మరో 127 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2 వేలు దాటింది. కొత్తగా దాదాపు 4 వేల మంది బాధితులు చేరారు. మొత్తం కేసులు 86 వేల పైమాటే.
పాకిస్థాన్‌లో మరో 869 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,348కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. దాయాది దేశంలో ఇప్పటివరకు 168 మంది కరోనా కారణంగా మరణించారు. దేశవ్యాప్తంగా 98 వేల మందికిపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
జింబాబ్వేలో కరోనా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు అధ్యక్షుడు ఎమర్సన్. దేశంలో మార్చి 30 నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 25 కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు