తెలంగాణ

telangana

ETV Bharat / international

కొత్తరకం కరోనా వల్ల బ్రిటన్​లో లాక్‌డౌన్‌ - boris jhonson

బ్రిటన్​లోని పలు ప్రాంతాల్లో మరోసారి పూర్తిస్థాయి లాక్​డౌన్ ప్రకటించింది బోరిస్ సర్కార్. కొత్తరకం కరోనా విజృంభణ వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. కుటుంబాలతో కలిసి క్రిస్మస్​ నిర్వహించుకునే వెలుసులుబాటును సైతం తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

lockdown-in-britain-after-rise-of-new-corona-virus
బ్రిటన్​లో మరోసారి లాక్‌డౌన్‌

By

Published : Dec 20, 2020, 5:23 AM IST

బ్రిటన్​లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కొత్తరకం కరోనా వైరస్‌ విజృంభిస్తుండడం వల్ల దాన్ని అరికట్టడానికి లండన్‌, దక్షిణ ఇంగ్లాండ్‌ సహా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు.

మూడు దశల లాక్​డౌన్ పద్ధతిని అవలంబిస్తున్న బ్రిటన్​.. లండన్​లో ఇప్పటికే మూడో దశను అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా నాలుగో టైర్ లాక్​డౌన్​ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అత్యవసరం కాని వ్యాపారాలన్నీ మూసేయాల్సి ఉంటుంది.

మరోవైపు క్రిస్మస్‌పై ఈ లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపనుంది. మూడు కుటుంబాలు కలిసి పండుగ నిర్వహించుకునేలా అవకాశం కల్పించనున్నట్లు ఇదివరకే ప్రధాని ప్రకటించగా.. టైర్-4 లాక్​డౌన్ ఉన్న ప్రాంతాల్లో ఈ వెసులుబాటు ఉండదని తాజాగా స్పష్టం చేశారు. ఈసారి క్రిస్మస్‌ను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

కరోనా సరికొత్తగా..

దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాన వైద్యాధికారి తెలిపారు. ఈ వైరస్‌ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందన్నారు. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్తరకం వైరస్‌ను వాక్సిన్‌ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు.

3.50 లక్షల మందికి టీకా

మరోవైపు బ్రిటన్​లో కరోనా టీకా పంపిణీ కొనసాగుతోంది. ఫైజర్‌ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి లభించగా.. 90 ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ ప్రపంచంలో తొలి కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 3.50 లక్షల మందికి తొలి డోసు టీకా అందించినట్లు బోరిస్ తెలిపారు.

ఐరోపా దేశాల్లోనూ..

ఇటలీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటం వల్ల మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు. క్రిస్మస్‌ నేపథ్యంలో ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్‌జోన్‌ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో అత్యవసర పనుల నిమిత్తం తప్ప బయట తిరిగేందుకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. క్రిస్మస్‌ నేపథ్యంలో యూరప్‌ దేశాలైన జర్మనీ, నెదర్లాండ్‌లు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించాయి.

ఇదీ చూడండి :'అలా చేయకపోతే..చైనా నుంచి మరో మహమ్మారి'

ABOUT THE AUTHOR

...view details