ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బోరిస్ జాన్సన్ ముందు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలో విజయంతో బ్రెగ్జిట్‌కు మార్గం సుగమమైనప్పటికీ... యూకేలోని స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు బ్రిటన్ నుంచి విడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బ్రెగ్జిట్‌పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో స్కాట్లాండ్, ఐర్లాండ్‌లు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేయలేదు. అంతేగాక తాజా ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ కాకుండా అక్కడి స్థానిక పార్టీలకు ఆధిక్యం రావడమూ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బోరిస్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాల్లో గెలుపొందింది. అందులో 345 స్థానాలు ఇంగ్లాండ్ నుంచి కాగా.... కేవలం 20 స్థానాలను ఇతర యూకే దేశాల్లో గెలుపొందింది.
స్కాటిష్ నేషనల్ పార్టీ హవా
స్కాట్లాండ్లో 59 సీట్లకు 48 స్థానాలను 'స్కాటిష్ నేషనల్ పార్టీ' గెలుపొందింది. ఈ పార్టీ బ్రెగ్జిట్‌కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేగాక యూకే నుంచి స్కాట్లాండ్కు స్వాతంత్ర్యం కోరుకుంటోంది. ఎన్నికల్లో పార్టీ ఘన విజయంతో స్కాట్లాండ్ వాసుల కోరికలు ఇతర యూకే వాసుల కోరికలకంటే భిన్నమైనవనే విషయం స్పష్టమైందని అన్నారు స్కాటిష్ పార్టీ నేత నికోలా స్టర్జన్.
యూకే నుంచి బయటకు వచ్చే అంశమై 2014లో స్కాట్లాండ్లో రిఫరెండం నిర్వహించగా... ఇందులో యూకేలో ఉండటానికే 55 శాతం మంది మద్దతిచ్చారు. అయితే బ్రెగ్జిట్ పరిణామాల వల్ల పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, ఇష్టంలేకపోయినా ఐరోపా సమాఖ్య నుంచి స్కాట్లాండ్ వైదొలిగే పరిస్థితి ఉందని స్కాటిష్ పార్టీ చెబుతోంది. ఈయూ నుంచి వైదొలిగే అంశంపై స్కాట్లాండ్ స్వతంత్రంగా నిర్వహించుకునే రిఫరెండం ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలనంటోంది.
అయితే 2014 రిఫరెండం నిర్ణయాత్మకమైనదని, దాన్ని గౌరవించాలని ప్రధాని బోరిస్ జాన్సన్.. స్కాటిష్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దీంతో ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. యూకే ప్రస్తుతం రాజ్యాంగపర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.