Russia-Ukraine conflict: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య రెండో రోజుకు చేరింది. భీకర దాడులు చేస్తోన్న రష్యాను నిలువరించండి మహాప్రభో అంటూ ఉక్రెయిన్ వేడుకుంటోంది. అయితే.. ఆ దేశానికి మద్దతుగా అమెరికా సహా ఏ ఒక్క దేశమూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. మేమూన్నామంటూ నేరుగా రంగంలోకి దిగడంలేదు. ఆపద కాలంలో అండగా ఉంటారని ఐరోపాలోని 27 దేశాలను నమ్ముకున్న ఉక్రెయిన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందా? వారి అండ చూసుకుని రష్యాతో కయ్యం పెట్టుకున్న ఉక్రెయిన్ మోసపోయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
నాటో దళాలు మద్దతు ఇస్తున్నట్లు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవటం వల్ల కీవ్ తనను తాను రక్షించుకునేందుకు ఒంటరి పోరాటం చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తాజాగా పేర్కొన్నారు. " మీరు మాతో ఉన్నారా? అని వారిని అడిగాను. మాతోనే ఉన్నట్లు వారు సమాధానమిచ్చారు. కానీ, వారు కూటమిలోకి చేర్చుకోవాలనుకోవట్లేదు. నాటోలో ఉక్రెయిన్ భాగమవుతుందా? అని 27 ఐరోపా దేశాల నేతలను నేరుగా ప్రశ్నించా. వారంతా భయపడుతున్నారు. కనీసం స్పందించటం లేదు" అని ఆందోళన వ్యక్తం చేశారు జెలెన్స్కీ.
రష్యాను ఒంటరిగా ఎదుర్కోవాలని పశ్చిమ దేశాలు వదిలేశాయని ఆరోపించారు జెలెన్స్కీ. ఈ సంక్షోభానికి తెరదించేలా చర్చలు జరిపేందుకు తాను భయపడటం లేదని స్పష్టం చేశారు. అయితే, అందుకు తమకు భద్రతాపరమైన హామీ కావాలన్నారు. శుక్రవారం తెల్లవారుజామున మాట్లాడిన అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఉక్రెయిన్ ప్రమాదంలో ఉందని పశ్చిమ దేశాలకు తెలియజేసినట్లు చెప్పారు.
" రష్యా గురించి మేము భయపడటం లేదు. రష్యాతో మాట్లాడేందుకు భయం లేదు. ఉక్రెయిన్‌కు తటస్థ స్థితి కోసం చర్చలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, మా దేశానికి థర్డ్‌పార్టీ గ్యారంటీ కావాలి. కానీ, ఇప్పుడు మేము నాటోలో లేము. రష్యా మిలిటరీ దాడులను ఆపేలా చర్చలు ఉండాలి."