భూతాపానికి ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం ఉక్కిరిబిక్కిరవుతోంది. తెల్లటి మంచు దుప్పటి కింద ఉండే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగి (Arctic warminig faster) హిమం గల్లంతవుతోంది. దీనివల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సత్వర చర్యలతో దీన్ని అడ్డుకోకుంటే అనేక ప్రాంతాల్లో జల ప్రళయం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలోని సముద్ర జలాలు మిగతా భూగోళంకన్నా మూడు రెట్లు ఎక్కువగా వేడెక్కుతున్నందున ఆ జలాలపై మంచు వేగంగా కరిగిపోతోంది. ఆర్కిటిక్‌లోని హిమానీ నదాలు (Arctic ice melting) రోజురోజుకీ కుంచించుకుపోతున్నాయి. కొన్ని హిమానీ నదాలు ఇప్పటికే కరిగి నీరైపోయాయి. ధ్రువ ప్రాంతంలో మంచు కప్పిన నేల (పెర్మా ఫ్రాస్ట్) కింద బందీ అయిన మీథేన్ వాయువు ఇప్పుడు పైకి ఎగదన్నుతూ భూతాపాన్ని పెంచుతోంది. అతిశీతల ఆర్కిటిక్ అడవులనూ నేడు కార్చిచ్చు దహించేస్తోంది. ఏడాది పొడవునా మంచు దుప్పటి కింద ఉండే సైబీరియాలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని ఉష్ణ మండలాన్ని తలపిస్తోంది. రానున్న రెండు దశాబ్దాలలో ఆర్కిటిక్ ప్రాంతంలో వేసవి రోజుల్లో సముద్ర జలాలపై మంచు కనుమరుగై పోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల హెచ్చరికలు..
ఇప్పటికైనా మనం మేల్కొని కర్బన ఉద్గారాలను తద్వారా భూతాపాన్నీ కట్టడి చేయకపోతే పరిస్థితి చేజారిపోవచ్చని గ్రీన్ ల్యాండ్ హిమఖండంలో ఏటా పరిశోధనలు జరిపే అమెరికన్ శాస్త్రవేత్త ట్వైలా మూన్ హెచ్చరించారు. ఆర్కిటిక్‌లో మంచు అదృశ్యమైతే మిగతా ప్రపంచంలో వాతావరణ వైపరీత్యాలు విరుచుకుపడతాయని నాసా మాజీ ప్రధాన శాస్త్రవేత్త వలీద్ అబ్దలాతీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంపైన ఉండే తెల్లని మంచు.. సూర్యకాంతిని అంతరిక్షంలోకి పరావర్తనం చెందించి భూఉష్ణోగ్రత పెరగకుండా చూస్తుంది. ఇప్పుడు ఆ మంచుదుప్పటి కరిగి భూతాపాన్ని కట్టడి చేయలేకపోతోందని మనిటోబా విశ్వవిద్యాలయ హిమ శాస్త్రవేత్త జూలియన్ స్ట్రోవ్ వివరించారు. వేసవిలో ఆర్కిటిక్ మంచు కరిగిపోతే దాని కింద ఉన్న నల్లని సముద్ర జలాలు బయటపడతాయి. అవి నల్లని దుస్తుల్లా వేడిని పీల్చుకుని భూ ఉష్ణోగ్రత (earth temperature increase rate) పెరగడానికి కారణమవుతాయని మూన్ హెచ్చరించారు.