జర్మనీలో(Germany covid cases) కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 33,949 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 165 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. జర్మనీలో కొవిడ్-19 వైరస్ ప్రబలినప్పటినుంచీ ఈ స్థాయిలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారన్నారు.
జర్మనీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న క్రమంలో ఆ దేశ వైద్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్.. 16 రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ విజృంభణ, ఐసీయూ పడకల సామర్థ్యంపై చర్చించనున్నారు. దేశంలో ఇంకా వ్యాక్సిన్ తీసుకోనివారు.. వెంటనే టీకా వేసుకోవాలని సీనియర్ వైద్యఅధికారులు సూచిస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం జర్మనీలో ఇప్పటివరకు 8కోట్ల 30లక్షలమంది కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్(Germany vaccine update) తీసుకున్నారు.
రష్యాలో రికార్డు స్థాయిలో మరణాలు..
రష్యాలో కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది. బుధవారం ఒక్కరోజే దేశంలో 1,195 మంది వైరస్ బారినపడి మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు 1,189 మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. సెప్టెంబరు చివరివారం నుంచి రష్యాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.