నూతన సంవత్సరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్- భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగిన అధికారిక టెలిఫోన్ సంభాషణలో కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సహా కశ్మీర్ అంశంపైనా అగ్ర నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి సమగ్ర ప్రణాళిక(జేసీపీఏ)లో సంతకం చేసిన పీ5 దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి కాగా.. ఇరాన్‌తో జరిగిన ఈ అణు ఒప్పందం నుంచి అమెరికా 2018లోనే వైదొలిగింది. ఉక్రెయిన్ విమానం కూల్చివేత ఘటన సహా ఇరాన్-అమెరికాల మధ్య ఇటీవలే చెలరేగిన ఉద్రిక్తతల నడుమ ఫ్రాన్స్ శాంతి మంత్రం జపిస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హితవు పలికింది. ప్రస్తుతం భారత్ వైఖరీ ఇదే. గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 80 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్న నేపథ్యంలో.. పశ్చిమాసియా ప్రాంతంలో తలెత్తే ఉద్రిక్తతలు భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనితో పాటు ఇంధన భద్రత కోసం భారత్ నిర్మిస్తున్న వ్యూహాత్మకంగా కీలకమైన చాబహర్ ఓడరేవుపైనా ప్రభావం పడనుంది.
ఈ నేపథ్యంలో జనవరి 10న మోదీ-మెక్రాన్ల ఫోన్ సంభాషణ అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికార నివాసం ఓ ప్రకటన విడుదల చేసింది. 'పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే ఆవశ్యకతపై ఫ్రాన్స్ అధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరువైపుల వారిని సంయమనం పాటించాలని కోరుతూ.. ఉద్రిక్తతలు తగ్గించడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు' అని ప్రకటనలో వెల్లడించింది.
'కశ్మీర్‌ను గమనిస్తున్నాం'
అమెరికా, నార్వే, దక్షిణ కొరియా రాయబారుల కశ్మీర్ పర్యటనకు ఒక్క రోజు ముందు ఇరుదేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో భాగంగా కశ్మీర్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఐరోపా దేశాల రాయబారులను సైతం కశ్మీర్ పర్యటనకు ఆహ్వానిస్తామని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలన్నింటితో భారత్ చర్చలు జరుపుతోంది. భవిష్యత్తులో జరిగే ఈ పర్యటనలో ఫ్రాన్స్ దేశాల అధికారులు సైతం పాల్గొనే అవకాశం ఉంది. 'ఇరుదేశాల మధ్య ఉన్న నమ్మకమైన సంబంధాల్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య కశ్మీర్‌లోని పరిస్థితుల అంశంపై చర్చించారు. ఫ్రాన్స్ ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తూనే ఉంటుంది' అని ప్రకటన స్పష్టం చేసింది.