ఆర్మేనియా, అజెర్బైజాన్ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అజెర్బైజాన్కు చెందిన మూడు యుద్ధ ట్యాంకర్లు ఆ ప్రాంతంలో దాడి చేశాయని.. ఘటనలో ఓ మహిళ, చిన్నారి మృతి చెందినట్లు ఆర్మేనియా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వెంటనే స్పందించిన తమ దళాలు అజెర్బైజాన్కు చెందిన రెండు హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఆర్మేనియా స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని అజెర్బైజాన్ రక్షణ మంత్రి అంగీకరించలేదు. అయితే కొన్ని స్థానిక మీడియా వర్గాల ప్రకారం.. ఇరుదేశాల ఘర్షణలో 23 మంది చనిపోగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
మరణించిన 23మందిలో 16మంది ఆర్మేనియా వేర్పాటు వాదులున్నారు. ఆ దేశానికే చెంది ఓ మహిళ , చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు. అజెర్బైజాన్కు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు ఈ ఘర్షణలో మరణించారు.
టర్కీ స్పందన...
అజెర్బైజాన్తో సాన్నిహిత్యం గల టర్కీ తాజా ఘటనపై స్పందించింది. ఆర్మేనియా దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. అయితే అజెర్బైజాన్ బలగాలే తొలుత తమపై దాడి చేశాయని.. వాటిని ఎదుర్కోవడానికే తాము ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని ఆర్మేనియా వాదిస్తోంది.
"ఈ దాడితో ఆర్మేనియా మరోసారి నిబంధనలను ఉల్లంఘించింది. మేము అజెర్బైజాన్కు అండగా నిలుస్తాం. ఆర్మేనియా నిప్పుతో చెలగాటమాడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆర్మేనియా ఉల్లంఘించింది. ఈ విద్వేషపూరిత చర్యలపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి."
-- టర్కీ
పర్వతప్రాంతాలతో నిండి ఉన్న నాగోర్నో-కారాబాఖ్ 4,400 చదరపు కిలోమీటర్ల విస్త్రీర్ణంలో ఉంది. ఇది ఆర్మేనియా సరిహద్దు నుంచి 50 కి.మీ. దూరంలో ఉంటుంది. అజెర్బైజాన్కు చెందిన ఈ ప్రాంతం 1994 తర్వాత ఆర్మేనియా నియంత్రణలోకి వెళ్లింది. అయితే తమ ప్రాంతాన్ని తిరిగివ్వాలని అజెర్బైజాన్ అంతర్జాతీయ వేదికలపై తమ వాదన వినిపించినా.. ఫలితం రావడం లేదు. జులై నెలలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగగా.. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.