కరోనా మహమ్మారి రక్కసిని అడ్డుకునేందుకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్ డోసులను కూడా అందిస్తున్నాయి. అయినా సరే యూకే, రష్యా లాంటి దేశాల్లో మళ్లీ కొవిడ్ విజృంభణ మొదలైంది. ఆయా దేశాల్లో డెల్టా రకం వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. మరి.. టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ఉద్ధృతికి కారణమేంటి? అంటే.. వ్యాక్సిన్ వేసుకున్నవారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
కరోనా రకాల్లోనే అత్యంత ప్రమాదకరమైన, వేగవంతమైన వేరియంట్‌గా పిలుస్తున్న డెల్టా రకం వైరస్.. టీకా వేసుకున్న వ్యక్తి నుంచి కూడా సులువుగా ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్.. 621 మందితో ఏడాది పాటు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందట. వీరి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా.. టీకా వేసుకున్న వ్యక్తుల నుంచి వారి కుటుంబసభ్యులకు వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది.