అమెరికా దిగ్గజ సంస్థ మోడెర్నా తయారు చేసిన కొవిడ్ టీకాకు ఐరోపా సమాఖ్య నియంత్రణ ఏజెన్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా 27 దేశాల ఐరోపా కూటమికి రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికేఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి ఐరోపా సమాఖ్య అనుమతించింది.
మోడెర్నా టీకా ఆమోదించాలని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీకి చెందిన మానవ ఔషధ కమిటీ.. ఈయూ ఎగ్జిక్యూటివ్ కమిషన్కు సూచించింది. మెడిసిన్స్ ఏజెన్సీ సిఫార్సులను ఈయూ కమిషన్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది.
టీకా అనుమతుల కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయడాన్ని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్ స్వాగతించారు. ఈయూ సభ్యదేశాలకు సత్వరమే టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
నెదర్లాండ్స్లో ఆలస్యంగా
మరోవైపు, ఈయూలోని అనేక దేశాల్లో రెండు వారాల క్రితమే వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. తాజాగా నెదర్లాండ్స్లో టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. కేర్హోమ్, వైద్య సిబ్బందికి ముందుగా టీకాలు ఇవ్వనున్నారు. సన్నా ఎల్కాదిరీ అనే మహిళ దేశంలో తొలి టీకా డోసును స్వీకరించారు.