Elon Musk Ukraine: రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు బిలియనీర్ ఎలాన్ మస్క్ బాసటగా నిలిచారు. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఇంటర్నెట్కు తీవ్ర అంతరాయం..
రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమయంలో అక్కడి ప్రజలకు కీలక సమాచారం చేరవేయడం ఎంతో కీలకం. ఇప్పుడు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోలేక ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో మస్క్ తనవంతుగా ఉక్రెనియన్లకు సాయంగా నిలవడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అంతకుముందు ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్.. స్టార్‌లింక్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని మస్క్‌కు విజ్ఞప్తి చేశారు.
"మీరు అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించాలని చూస్తున్నారు-ఇక్కడ రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తోంది; మీ రాకెట్లు అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపై దిగుతున్నాయి- ఇక్కడ రష్యన్ రాకెట్లు ఉక్రెయిన్ పౌరులపై దాడి చేస్తున్నాయి ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ సేవల్ని అందించాలని కోరుతున్నాం" అంటూ ఫెదొరోవ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. సరిగ్గా 10 గంటల్లో మస్క్ ఆ దిశగా చర్యలు చేపట్టడం విశేషం.
ప్రపంచ నలుమూలలకు ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ దిగువ కక్ష్యలో భారీ ఎత్తున కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఇప్పటికే 2000 శాటిలైట్లను కక్ష్యలో నిలిపారు. శుక్రవారమే 50 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు.
ఇదీ చూడండి:దిల్లీ చేరుకున్న మూడో విమానం.. భారత్‌కు మరో 240 మంది