రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. విదేశాల్లో అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై విచారణలో భాగంగా యూకే అధికారులను సంప్రదించింది. వాద్రాకు సంబంధించిన ఆస్తులు, నగదు చలామణీ పూర్తి వివరాలను అందించాల్సిందిగా యూకే అధికారులను కోరింది. యూకేతో పాటు వివిధ దేశాలకు చెందిన ఆర్థిక నిఘా సంస్థలనూ కోరినట్లు ఈడీ ఉన్నతాధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అక్రమంగా కొనుగోలు చేసిన లండన్‌లోని ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ సన్నద్ధం అవుతున్నట్లు వెల్లడించారు.
ఇవి మాత్రమే కాకుండా యూకేలోని మరికొన్ని అక్రమ ఆస్తులతో వాద్రాకు సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఆస్తుల కోనుగోలుకుగాను సైప్రస్, దుబాయ్ దేశాల్లో నగదు లావాదేవీలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారముంది.