Covid pregnant women: గర్భిణులు కొవిడ్ బారిన పడితే ఆరోగ్యపరంగా పలు సంక్లిష్టతలు తలెత్తే ముప్పుందని ఓ అధ్యయనం గుర్తించింది. ప్రసవ సమయంలోనూ వారికి.. ఇతరులతో పోలిస్తే ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఫ్రాన్స్‌లో గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆసుపత్రుల్లో చేరిన 2,44,465 మంది గర్భిణులపై యూనివర్సిటీ డి పారిస్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో 874 మంది కొవిడ్ బాధితులు ఉన్నారు.
"కరోనా సోకని వారితో పోలిస్తే.. కొవిడ్ బాధిత గర్భిణుల్లో అధిక రక్తపోటు, రక్తస్రావం, కోమా, అవయవ వ్యవస్థల వైఫల్యం వంటి ముప్పులు ఎక్కువగా ఉన్నట్లు మేం గుర్తించాం. వారు ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులు అధికంగా తలెత్తాయి. గర్భం తొలగింపు, నిర్జీవ జననాలు, రక్తం అధికంగా గడ్డ కట్టడం వంటి ఇబ్బందులు, మృత్యు ముప్పు మాత్రం కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా ఏమీ కనిపించలేదు."